మియాపూర్, చందానగర్​లో 144 సెక్షన్​

మియాపూర్, చందానగర్​లో 144 సెక్షన్​
  • హెచ్ఎండీఏ భూముల్లో పోలీసులపై దాడిని సీరియస్​గా తీసుకున్న ఉన్నతాధికారులు..
  • కబ్జాకు ప్రయత్నిస్తున్న  21 మంది అరెస్టు
  • శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: కేటీఆర్ ట్వీట్

మియాపూర్, వెలుగు: మియాపూర్​లోని హెచ్ఎండీఏ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. శనివారం ఈ స్థలంలో గుడిసెలు వేసేందుకు మహిళలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పోలీసులను రప్పించారు. 

భూమిలో ఆందోళన చేస్తున్న వారిని శనివారం అర్ధరాత్రి అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతంలో ఈ భూములను డ్రోన్​ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చందానగర్​, మియాపూర్​ పోలీస్​ స్టేషన్ లిమిట్స్​లో  ఈ నెల 29 వరకు144 సెక్షన్​ అమలు చేస్తూ సైబరాబాద్​ సీపీ అవినాష్​ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం మియాపూర్​కు చేరుకున్న ఆయన పరిస్థితిని సమీక్షించారు. 

సోషల్​ మీడియాలో ప్రచారంతో..

మియాపూర్​లోని​ ప్రశాంత్​నగర్, దీప్తిశ్రీనగర్, హెచ్​ఎంటీ స్వర్ణపురి, మక్తా కాలనీ సరిహద్దుల్లోని100,101 సర్వే నంబర్లలో550 ఎకరాల హెచ్ఎండీఏ భూమి ఉంది. ఈ భూమిపై ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వం మధ్య కోర్టులో కేసు నడుస్తుంది. ఇక్కడ గుడిసెలు వేసుకుంటే ఇంటి జాగా తమదే అని సోషల్​ మీడియాలో కొందరు ప్రచారం చేశారు. తొలుత మియాపూర్​కు ఆనుకొని ఉన్న బస్తీల ప్రజలు ప్రయత్నం చేశారు. తర్వాత బంధువులు, తెలిసిన వారి ప్రచారంతో ఇతర జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో పేదలు తరలివచ్చారు. చీరలు, తాళ్ల సహయంతో గుడిసెలు, బౌండరీలు ఏర్పాటు చేసుకున్నారు. 

ఈ భూమిలో నెల రోజులుగా కొందరు స్థానిక మహిళలు గుడిసెలు వేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఇటూ పోలీసులు, హెచ్ఎండీఏ అధికారులు గుర్తించడంలో విఫలం కావడం విస్మయానికి గురిచేస్తోంది.

కాంగ్రెస్​ ప్రభుత్వ ఘోర వైఫల్యం: కేటీఆర్

మియాపూర్​ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. కాంగ్రెస్​ అసమర్థ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. 

రాళ్ల దాడి కేసులో 21 మంది అరెస్టు

పోలీసులపై రాళ్ల దాడి, భూ కబ్జాకు ప్రయత్నించి మొత్తం 50 మందిలో 21 మందిని మియాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం రాత్రి మియాపూర్​ పోలీస్​ స్టేషన్​లో మాదాపూర్​ జోన్​ డీసీపీ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టైన​ వారిలో ప్రధాన నిందితురాలు మియాపూర్​కు చెందిన రోడ్ సైడ్​ హోటల్​ నిర్వహించే సంగీత(33)తో పాటు మునీర్​, లక్ష్మీభాయ్​, శ్రీనివాస్​నాయక్, లక్ష్మీ, లావణ్య, గౌరమ్మ, చంద్రమ్మ, పోలె లక్ష్మీ, అశోక్, నర్సింగ్​రావు, గోపాల కృష్ణ, బాలకోటి, గోపాల్​, సునిల్​, గోవింద్​, రమేశ్​, ప్రేమ్​కుమార్​, మహేశ్, అంబోతు స్వామి, ముడావత్​ మున్యాలు ఉన్నారు. మిగిలిన వారిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని డీసీపీ తెలిపారు..