
తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జులై 13న సికింద్రాబాద్ మహంకాళి (లష్కర్).. జులై 20న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి రేపు ( జులై 13) లష్కర్ బోనాలు సమర్పించనున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో తరలిరానున్నారు. బోనాలతో గుడికి వచ్చే ఆడపడుచులు, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఇక సోమవారం ( జులై 14) రంగం, ఫలహారం బండ్ల ఊరేగింపుతో సికింద్రాబాద్ దద్దరిల్లనుంది.
జూలై 13 ఆదివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లష్కర్ బోనం సమర్పిస్తారు. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్,దేవాదాయ శాఖ,పోలీసులు , జీహెచ్ ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
హైదరాబాద్... సికింద్రాబాద్ తో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా వారి ఆచారాల వ్యవహారాల ప్రకారం నిర్వహిస్తారు. రేణుకాఎల్లమ్మ, మల్లమ్మ తల్లి, పోచమ్మ, పెద్దమ్మతల్లి, పోలేరమ్మ, డొక్కాలమ్మ, ముత్తాలమ్మ, మారెమ్మ, మహంకాళమ్మ, మైసమ్మ, గండి మైసమ్మ, బంగారు మైసమ్మ.. ఇలా అనేక పేర్లతో గ్రామ దేవతలను పూజిస్తారు.
బోనంను పసుపు.. కుంకుమ.. వేప మండలతో అలంకరిస్తారు. వెండి.. బంగారు.. మట్టి పాత్రలను బోనంగా తయారు చేసి.. పైన దీపారాధనతో ఆడవాళ్లు తలపై బోనం పెట్టుకొని .. డప్పు.. మేళాలతో సందడి చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బోనం తీసుకెళ్లటంలో మహిళలు చాలా ఉత్సాహం చూపుతారు. మనసంతా భక్తి నింపుకుని తలపై బోనం ఎత్తుతారు. పట్టుచీరలు కట్టుకుని, నగలు వేసుకుని సాక్షాత్తూ లక్ష్మీ దేవిలా తయారై చిన్నా పెద్దా అంతా ఊరేగింపుగా బోనాన్ని తీసుకెళ్తారు.