​పద్మారావు గౌడ్​కు చేదు అనుభవం

​పద్మారావు గౌడ్​కు చేదు అనుభవం
  • ఎన్నికల ప్రచార తొలిరోజే తీవ్ర వ్యతిరేకత 
  • పార్టీ జెండా ఆవిష్కరణలో అపశృతి
  • చీపురు పట్టుకొని, డప్పు కొట్టిన మహిళ
  • ఎందుకొచ్చావంటూ ప్రశ్నిస్తూ ఆగ్రహం
  • బీఆర్ఎస్​కు ఓటేయొద్దంటూ శాపనార్థాలు

పద్మారావునగర్, వెలుగు : సికింద్రాబాద్ ​సెగ్మెంట్ బీఆర్ఎస్​అభ్యర్థి టి.పద్మారావుగౌడ్​కు​ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన రోజే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మరో వైపు పార్శీగుట్ట వద్ద పార్టీ జెండా ఆవిష్కరణలో కూడా అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్​ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్​ తన ఎన్నికల ప్రచారాన్ని సోమవారం బౌద్ధనగర్​ డివిజన్ ​పార్శీగుట్టలో ప్రారంభించారు. ముందుగా ఆయన పార్టీ జెండా ఎగరవేసే సమయంలో అది తెరుచుకోలేదు.   దీంతో  జెండాను కిందికి దించి, మళ్లీ పైకి ఎగరవేసినా పూర్తిగా తెరుచుకోలేదు. తిరిగి రెండోసారి జెండాను కిందికి దించారు.  ఆయన కంట్లో దుమ్ము పడటంతో దానిని ఎగరవేయకుండానే కార్యకర్తలకు అప్పజెప్పి వెళ్లిపోయారు.

ఇక పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో చౌరస్తా వద్ద గల్లీలో డప్పు సునీత అనే మహిళ చీపురు పట్టుకొని, డప్పు కొట్టుకుంటూ పద్మారావు పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. పార్శీగుట్ట చౌరస్తాలోని వైన్​ షాపులు, బార్లతో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పోకిరీలు రోడ్డు పక్కన కూర్చొని మహిళలను వేధిస్తున్నారని వాపోయింది. గతంలో వైన్​ షాపులను తీసివేయాలని తాను 21 రోజులు ధర్నా చేస్తే పట్టించుకోని పద్మారావు ఇప్పుడు ఎందుకు ఓట్ల కోసం వస్తున్నారని ప్రశ్నించింది. వైన్​షాపులను వ్యతిరేకిస్తే తనపై కేసులు కూడా పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈసారి బీఆర్ఎస్​ తప్పకుండా ఓడిపోతుందని, ఆ పార్టీకి ఎవరూ ఓటు వేయకూడదని ఆమె శాపనర్థాలు పెట్టింది. అసలు సికింద్రాబాద్​ను ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించింది.అక్కడున్న పోలీసులు, కార్యకర్తలు  ఆమెను అడ్డుకొని  అక్కడి నుంచి పంపించేశారు. ఇలా తొలిరోజే పద్మారావుగౌడ్​కు చేదు అనుభవం ఎదురైంది.