
అయోధ్య:
అయోధ్యలో పోలీసులు హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 6న బ్లాక్ డే సందర్భంగా (బాబ్రీ మసీదు కూల్చిన రోజు) ఎలాంటి ఘటనలు జరగకుండా సెక్యూరిటీని టైట్ చేశామని అయోధ్య కలెక్టర్ అంజూ ఝా చెప్పారు. అయోధ్య తీర్పు సందర్భంగా గొడవలు ఏమీ జరగనప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తీవ్రతను బట్టి ఆయా ఏరియాలను నాలుగు జోన్లుగా చేశారు. 2.77 ఎకరాల రామజన్మభూమిని రెడ్ జోన్, అయోధ్య సిటీ మొత్తం ఎల్లో జోన్, జిల్లా మొత్తం గ్రీన్ జోన్, పరిసర జిల్లాల్లో బ్లూజోన్లుగా విభజించి సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. రామజన్మభూమిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో సెక్యూరిటీని పెంచామన్నారు. డిసెంబర్ 28 వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చెప్పారు.
మేమంతా ఎలర్ట్‌గా ఉన్నాం: ఝా
అయోధ్య తీర్పు సందర్భంగా సిబ్బంది అంతా ఎలర్ట్‌గా ఉందని ఝా అన్నారు. జిల్లాలోని అన్ని మసీదుల దగ్గర శుక్రవారం సెక్యూరిటీని పెంచామని, ఎలాంటి ఘటన జరిగినా వెంటనే సమాచారం అందిచాలని సిబ్బందిని ఆదేశించామని చెప్పారు. తీర్పు సందర్భంగా సోషల్ మీడియాపై నిఘా ఏర్పాటు చేశామని, హనుమాన్ గర్హి, కనక భవన్, దశరథ మహల్, రామ్ కీ పైడి లాంటి ముఖ్య ప్రదేశాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కార్తీక పౌర్ణమికి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు వచ్చారని, ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నామన్నారు. స్కూళ్లు, కాలేజీలు ఈ నెల 13న తెరుచుకున్నాయని, అయోధ్యలోని కొన్ని ఏరియాల్లో బారికేడ్లను తొలగించి స్టూడెంట్స్‌కు ఇబ్బంది లేకుండా చేశామన్నారు.
డిసెంబర్ 6 వివాదం
1528లో మొఘల్స్ రామమందిరాన్ని కూల్చేసి బాబ్రీ మసీదును నిర్మించారంటూ కరసేవకులు 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చేశారు. దీంతో అయోధ్యలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు డిసెంబర్ 6ను శౌర్య దివాస్‌గా, ముస్లింలు దాన్ని బ్లాక్‌డేగా చెప్తారు.