
- నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు
- ఐజీ సత్యనారాయణ వెల్లడి
- ఈ నెల 12న బుద్ధపూర్ణిమ సందర్శనకు మిస్ వరల్డ్ పోటీదారులు
- భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు ఆదేశాలు
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధ పూర్ణిమను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనుండగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఈనెల12న మిస్ వరల్డ్ పోటీదారులు సాగర్కు వస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన టూరిజం గెస్ట్ హౌజ్, విజయ విహార్, బుద్ధవనం ప్రాంతాలను పరిశీలించారు.
ఆయా ప్రదేశాల్లో తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 10 నుంచి 31 వ తేదీ వరకు హైదరాబాద్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ – 2025 పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులోభాగంగా 1200 నుంచి 1500 మంది పోలీసులతో బందోస్తును ఏర్పాటు చేయడంతో పాటు అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారన్నారు.
బౌద్ధ సంప్రదాయాలకు నిలయమైన 30 నుంచి 40 ఆసియా దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు సాగర్ ను సందర్శించనున్నారు. విజయ విహార్ అతిథి గృహానికి ముందుగా చేరుకొని అక్కడినుంచి బుద్ధవనం సందర్శించి బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటిస్తారని, అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేసిన తర్వాత జాతకవనంలో పలు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
తిరిగి హైదరాబాద్ చేరేవరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక పర్యవేక్షణలో ప్రతిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా నిరసనలకు దిగి అంతరాయం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.