- పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ అరికట్టేందుకు క్రైమ్ టీమ్స్
- మహిళల రక్షణ కోసం షీ టీమ్స్
- సీతారాం బాగ్‌లో అధికారుల సమన్వయ సమావేశం
మెహిదీపట్నం, వెలుగు: సిటీలో మార్చి 27న శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సర్వం సిద్ధమయ్యారు. సోమవారం సీతారాం బాగ్‌లోని ద్రౌపది గార్డెన్స్‌లో జరిగిన అధికారుల సమన్వయ సమావేశంలో సీపీ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు క్రమశిక్షణతో జరుపుకోవాలని కోరారు.
భద్రత కోసం 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ అరికట్టేందుకు క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు.
డీజేలకు బదులు సౌండ్ సిస్టమ్స్ వాడాలి
గతేడాది వాహనాల బ్రేక్‌డౌన్ వల్ల యాత్ర నెమ్మదించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి అటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. యాత్రను మధ్యాహ్నం 1 గంటకే ప్రారంభించాలని, ఇరుకైన మార్గాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
శబ్ద కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని డీజేలకు బదులుగా సాధారణ సౌండ్ సిస్టమ్ వాడాలని, ఇతర వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా పాటలు, ప్రసంగాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లు వాడాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. భక్తుల కోసం రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు పూర్తి చేశామని, వాహనాల ఎత్తు విషయంలో నిర్వాహకులు జాగ్రత్త వహించాలని సూచించారు.
ఉత్సవ సమితి సభ్యులు భగవంతరావు, గోవింద్ రాఠి, ఆనంద్ సింగ్ తదితరులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు. అనంతరం అధికారులు శోభాయాత్ర రూట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, ఎన్. శ్వేత తదితరులు పాల్గొన్నారు.
