మోడీ కర్నాటక పర్యటనలో భద్రతా లోపం

మోడీ కర్నాటక పర్యటనలో భద్రతా లోపం

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నాటక పర్యటనలో భద్రతా లోపం చోటుచేసుకుంది. మోడీకి దండెయ్యడానికి ఓ టీనేజర్ ఆయన దగ్గరికి ఉర్కొచ్చిండు. టైట్ సెక్యూరిటీ ఉండగా, ఆ టీనేజర్ ఎలా వచ్చాడు? అనేది చర్చనీయాంశంగా మారింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రారంభించేందుకు మోడీ గురువారం హుబ్బళ్లికి వచ్చారు. రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ లో కార్యక్రమం ఉండగా, ఎయిర్ పోర్టు నుంచి అక్కడి వరకు మోడీ రోడ్ షో నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.

రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనానికి తన కారుపై నిలబడి అభివాదం చేస్తూ మోడీ ముందుకుసాగారు. ఈ క్రమంలో 15 ఏండ్ల టీనేజర్ ఒక్కసారిగా రోడ్డుపైకి ఉర్కొచ్చిండు. మోడీ దగ్గరి దాకా వెళ్లి, ఆయనకు దండ వేయడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది టీనేజర్ ను పక్కకు లాగారు. అయితే ఆ దండను తీసుకునేందుకు మోడీ కూడా చేయి చాచారు. తర్వాత ఎస్పీజీ సిబ్బంది ఆ దండను తీసుకొని ప్రధానికి అందజేశారు. టీనేజర్ ను అక్కడి నుంచి పంపించారు.