సీమా, సచిన్‌లకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

సీమా, సచిన్‌లకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

ప్రేమంటూ భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుడితో కలిసి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సీమా హైదర్(30) 2023 జూలై 22 శనివారం ఉదయం అస్వస్థతకు గురైంది. ఆమెతో పాటుగా ఆమె భర్త సచిన్ మీనా కూడా అస్వస్థతకు గురయ్యారు.   

తన ప్రేమికుడితో కలిసి ఉండటానికి నేపాల్ ద్వారా తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జాతీయురాలైన  సీమా హైదర్ ను 2023 జూలై 4న పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే వారిద్దరికీ స్థానిక కోర్టు జూలై 7న బెయిల్ మంజూరు చేసింది.  

సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ బాగోతంపై ఉత్తరప్రదేశ్ యాంటి టెర్రిరస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దర్యాప్తు సాగిస్తున్న క్రమంలో ఈ ప్రేమజంట అస్వస్థతకు గురికావడంతో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.  

మరొవైపు భారత పౌరసత్వం కోరుతూ సీమా హైదర్ 2023 జూలై 21 శుక్రవారం రోజున  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో, ఆమె తన భర్త ఇంట్లో నివసించడానికి అనుమతించాలని పేర్కొంది. 

సీమా సచిన్ మీనాతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను జత చేశారు.ఇందులో ఒక ఫోటోలో సీమా సచిన్ కు పాదాభివందనం చేశారు.