వేసవి లో తాగునీటి గోస రావొద్దు : మంత్రి సీతక్క

వేసవి లో తాగునీటి గోస రావొద్దు : మంత్రి సీతక్క
  •     సర్పంచ్​లతో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టండి 
  •     అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో ప్రజలకు నిరంతరం శుభ్రమైన తాగునీటి సరఫరా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీ రాజ్​శాఖ మంత్రి సీతక్క అన్నారు. వేసవిలో తాగునీటి గోస రావొద్దని, సర్పంచ్​లతో కలిసి స్పెషల్​డ్రైవ్​చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ఆఫీస్​లో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, మిషన్ భగీరథ ఈఎన్​సీ కృపాకర్ రెడ్డి, సీఏఈలు, ఎస్‌ఈలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, గ్రామాల వారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వ ఉందని, వేసవిలో పెద్దగా ఇబ్బందులు ఉండవని తెలిపారు. 

ప్రతీ ఎస్‌ఈ పరిధిలో ఇంటింటికీ తాగునీటి సరఫరా పరిస్థితిని మంత్రి తెలుసుకున్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించారు. రాష్ట్రంలోని 24 వేల జనావాసాల్లో కేవలం 150 ఆవాసాలకు మాత్రమే మిషన్ భగీరథ నీరు అందడం లేదని, ఇటీవల కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటయ్యాయని ఆఫీసర్లు పేర్కొన్నారు. కొండలపై, అటవీ ప్రాంతాల్లో పైప్‌లైన్ వేయడం సవాల్‌గా ఉన్నచోట్ల స్థానిక జల వనరులను వినియోగించాలని మంత్రి చెప్పారు. 

సర్పంచ్​ల ఫోన్​కాల్స్​కు స్పందించాలి

సర్పంచ్‌ల ఫోన్ కాల్స్‌కు తక్షణమే స్పందిస్తూ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామాల వారీగా తాగునీటి అవసరాలపై సర్పంచ్‌లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. గ్రామీణ తాగునీటి సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చిస్తూ ప్రజల అవసరాలు తీరుస్తోందని తెలిపారు. 

ఉపాధి చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి

గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలుస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క కోరారు. వీబీజీ రాంజీని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఉపాధి హామీ మండలి ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన 9వ రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశం జరిగింది. 

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు పేదల ఆకలి తీర్చే అక్షయపాత్రలా మారిందన్నారు. కేంద్రం కొత్తగా ప్రతిపాదిస్తున్న విధానం అమల్లోకి వస్తే కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని మండలి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. 

దీనిని తాము ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి మూడు నెలలకు కచ్చితంగా మండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ దివ్యతోపాటు మండలి సభ్యులు గుమ్మడి సొమయ్య, బీరెడ్డి భగవాన్ రెడ్డి, ఎన్. ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.