సెగ్మెంట్ రివ్యూ ..ఈ సారి జూబ్లీహిల్స్ లో గెలుపెవరిదో?

సెగ్మెంట్  రివ్యూ ..ఈ సారి  జూబ్లీహిల్స్ లో గెలుపెవరిదో?

హైదరాబాద్,వెలుగు : మిడిల్ క్లాస్, మైనార్టీ ప్రజలు ఎక్కువగా నివసించే అసెంబ్లీ సెగ్మెంట్ జూబ్లీహిల్స్. ప్రస్తుత ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్​అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో నిలిచారు. అయితే.. ముస్లిం మైనార్టీల ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్​ఏర్పాటైంది. తొలిసారి కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి, 2018లో బీఆర్ఎస్​నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.

ఈసారి హ్యాట్రిక్​ కొట్టేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్​ నుంచి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ దక్కలేదు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్​ను ​బరిలోకి దించారు. మజ్లిస్ ​నుంచి షేక్​ రషీద్ ఫరాదుద్దీన్, బీజేపీ నుంచి లంకల దీపక్​రెడ్డి పోటీలో ఉన్నారు. నాలుగు పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగినా ప్రధానంగా బీఆర్ఎస్​, కాంగ్రెస్​ మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. 

వీరి ఓట్లు ఎవరికి పడ్డా వారిదే గెలుపు

జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలో మోతీనగర్, బోరబండ, కళ్యాణ్​నగర్, టోలీ చౌక్ ప్రాంతాల్లో క్రిస్టియన్లు, సెటిలర్ ఓటర్లు ఎక్కువగా ఉండగా.. టోలీచౌక్, బోరబండ, షేక్​పేట ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా నివసిస్తుంటారు. వీరి ఓట్లను పొందేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈసారి సెగ్మెంట్​లో  కొత్తగా దాదాపు 50వేల మంది ఓటర్లు నమోదయ్యారు. వీరి ఓట్లు ఎవరికి పడ్డా వారి గెలుపు ఖాయమని చెప్పొచ్చు. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాత మార్చే ముస్లిం మైనార్టీలు ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తిగా మారింది. 

పథకాలు గెలిపిస్తయనే ధీమా ​

రెండుసార్లు గెలుపొందిన బీఆర్ఎస్ ​సిట్టింగ్ అభ్యర్థి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు.  గోపీనాథ్​​​మైనస్​లకు వస్తే... ప్రజలకు అందుబాటులో ఉండరని, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఉంటే తప్ప కనిపించరనే వాదన ఉంది. పథకాలు పార్టీ కార్యకర్తలకే అందించారనే, తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్ష సాధింపు  చర్యలకు పాల్పడతారనే  ఆరోపణలు ఉన్నాయి. . 

మైనార్టీ ఓటర్లే టార్గెట్ 

 కాంగ్రెస్​అభ్యర్థి మాజీ క్రికెటర్​అజారుద్దీన్ పోటీలో ఉండగా.. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వారి ఓట్లు తనకే పడతాయనే ధీమాతో ఉన్నారు. క్రికెటర్​గా తనకున్న క్రేజ్​కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.   బీజేపీ నుంచి అభ్యర్థి లంకల దీపక్​ రెడ్డి పోటీలో ఉండగా.. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ మధ్య ఓట్లు చీలితే తనకే లాభిస్తుందన్న ధీమాతో ఉన్నారు.

మరోసారి ఉనికిని చాటేందుకు

 2014లో మజ్లిస్​ పోటీ చేసినా మరోసారి తన ఉనికి చాటుకునేందుకు పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపింది. మజ్లిస్ అభ్యర్థిగా కార్పొరేటర్​ రషీద్​ ఫరాజుద్దీన్​ పోటీలో ఉన్నారు. అయితే.. రాజకీయంగా బీఆర్ఎస్​కు మేలు చేసేందుకు మజ్లిస్​ ఇక్కడి నుంచి పోటీ చేస్తుందనే వాదన ఉంది. మైనార్టీ ఓట్లను చీల్చడం ద్వారా బీఆర్​ఎస్​కు లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు. మజ్లిస్​కు సెగ్మెంట్ ప్రజ్లలో సానుభూతి ఉందని, తప్పకుండా తనకు ఓట్లు వేస్తారన్న ధీమాతో ఆ పార్టీ అభ్యర్థి ఉన్నారు. పార్టీ అధినేత అసదుద్దీన్​ఓవైసీ ప్రచారంతో తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.

సెగ్మెంట్ ఓటర్లు ఇలా..

మొత్తం                  3,75,430  
పురుషులు            1,98,204 
మహిళలు            1,77,207 
ట్రాన్స్ జెండర్లు  19