విద్యార్థులతో కలిసి సినిమాను చూడటం మర్చిపోలేని అనుభూతి

విద్యార్థులతో కలిసి సినిమాను  చూడటం మర్చిపోలేని అనుభూతి

భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులందరికీ గాంధీ సినిమాను ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తోంది.  ఈ సినిమాను సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల హైదారాబాద్ లోని దేవి థియేటర్ లో విద్యార్థులతో కలిసి చూశారు. వందల మంది విద్యార్థులతో గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి  శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు.

గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా అనిపించిదన్నారు. ఇలాంటి కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉందని,  గాంధీ సినిమాను అందరూ చూడాలని శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 552 థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈనెల 21 వరకు ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు 22.50 లక్షల మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని చూశారు.