పల్లె, పట్నం.. సెల్ఫ్ లాక్ డౌన్

పల్లె, పట్నం.. సెల్ఫ్ లాక్ డౌన్
  • మధ్యాహ్నం కల్లా షాపులు, హోటళ్లు బంద్ 
  • అనవసరంగా బయట తిరిగితే చర్యలు
  • మాస్కులు పెట్టుకోకుంటే ఫైన్లు 
  • 2 వేలకు పైగా ఊర్లలో ఆంక్షలు
  • ఎవరూ రాకుండా రోడ్లకు అడ్డంగా కంపలు, రాళ్లు

హైదరాబాద్​/నెట్​వర్క్​, వెలుగు: ఒక వైపు వేగంగా వ్యాప్తిస్తున్న కరోనా.. మరోవైపు టెస్టులు సక్కగా లేకపోవడం, హాస్పిటళ్లలో బెడ్లు దొరకకపోడం, మందులు అందకపోవడంతో  జనం భయపడుతున్నారు. పల్లెలు, పట్నాల్లో సెల్ఫ్​ లాక్​డౌన్​ అమలు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఊర్లు, మండల కేంద్రాలు, టౌన్లలో కరోనా కట్టడి కోసం స్వచ్ఛందంగా ఆంక్షలు పెట్టుకొని పాటిస్తున్నారు. మధ్యాహ్నం కల్లా షాపులు, హోటళ్లు బంద్ పెడుతున్నారు. అవసరం ఉంటే తప్ప బయటికి రావడం లేదు. అనవసరంగా బయట తిరిగినా, మాస్కులు పెట్టుకోకపోయినా ఫైన్లు వేస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు లాక్​డౌన్​ను అమలు చేస్తుండటంతో అక్కడ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం  లాక్​డౌన్​ పెడితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, పెట్టబోమని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దీంతో ఊర్లలో, పట్నాల్లో ప్రజలే ముందుకు వచ్చి సెల్ఫ్​ లాక్​డౌన్​ పాటిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో నెలరోజుల నుంచి సెల్ఫ్​ లాక్​డౌన్​ అమలవుతోంది. 

ఫస్ట్ వేవ్ లో   అర్బన్ ఏరియాలోనే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిన కరోనా.. సెకండ్ వేవ్ లో మాత్రం పల్లె, పట్నం అనే తేడా లేకుండా రాష్ట్రమంతా చుట్టేస్తోంది. దీంతో  ఒక్కో జిల్లాలో 60 నుంచి 100 ఊర్ల చొప్పున రాష్ట్రంలో సుమారు 2,500  గ్రామాల్లో సెల్ఫ్​ లాక్ డౌన్  అమలవుతోంది.  ఊర్లలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా రోడ్లకు అడ్డంగా కంప ముండ్లు, రాళ్లు, కట్టెలు వేస్తున్నారు. కరోనాతో బాధపడుతన్న వారికి కావాల్సిన సాయం అందజేస్తున్నారు.   

పగలు ఒంటి గంట తర్వాత అన్నీ బంద్​

కరోనా తీవ్రత కారణంగా ఏప్రిల్​చివరి వారం నుంచే వందలాది పల్లెలు, పట్నాల్లో సెల్ఫ్​ లాక్​డౌన్​ అమలుచేస్తున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో వీడీసీలు(విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీలు), సర్పంచులు, తహసీల్దార్లు కలిసి నిర్ణయం తీసుకుంటే.. టౌన్లు, కార్పొరేషన్లలోని వివిధ డివిజన్లలో మున్సిపల్​ చైర్​పర్సన్లు, కార్పొరేటర్లు ఇందుకు చొరవ చూపుతున్నారు. చాలాచోట్ల చాంబర్​ ఆఫ్​ కామర్స్​, కిరాణా మర్చంట్​ అసోసియేషన్స్​ ఆధ్వర్యంలో వ్యాపారులు మధ్యాహ్నం ఒంటి గంట కల్లా స్వచ్ఛందంగా షాపులు మూసేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పబ్లిక్​ కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావడం లేదు. ఆటోలు కూడా మధ్యాహ్నం తర్వాత రోడ్డెక్కడం లేదు. నిబంధనలు ఉల్లంఘించినవారికి పలు గ్రామాలు, టౌన్లలో రూ. 500 నుంచి వెయ్యి దాకా ఫైన్​ వేస్తున్నారు. 

హైదరాబాద్​లో బోసిపోతున్న రోడ్లు

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్  రోడ్లపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి. ఇప్పటికే కొందరు వలస కూలీలు, చిరు వ్యాపారులు లాక్ డౌన్ భయానికి సొంతూళ్లకు వెళ్లడం, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ కు వర్క్ ఫ్రం హోం ఇవ్వడం, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు మూసివేయడంతో నగరంలో చాలా మేరకు రద్దీ తగ్గింది. దీంతోపాటు నగరంలో ఉన్నవాళ్లు కూడా తప్పనిసరైతే తప్ప బయటి రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. కరోనా భయానికి కాలనీల్లోని పార్కులు, గ్రౌండ్స్ కు, జిమ్ లకు కూడా ప్రజలు వెళ్లడం లేదు. 

జిల్లాల్లో ఇలా..

  • ఆదిలాబాద్​ జిల్లాలోని జైనథ్​, బేల, ఉట్నూర్​, నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాలతోపాటు బోథ్ మండలం సోనాల ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామాల్లో పాక్షిక లాక్​డౌన్​ పాటిస్తున్నారు. జైనథ్​ మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులను నడుపుతున్నారు. బోథ్​ మండలం గుర్రాల తండా  గ్రామంలో పక్కింటికి వెళ్లినా రూ. వెయ్యి జరిమానా వేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా  కౌటాల, సిర్పూర్ టీ, బెజ్జూరు  మండల కేంద్రాల్లో జరిగే వార సంతలను మూడు వారాలుగా బంద్ పెట్టారు. చింతల మానే పల్లి మండల కేంద్రం లో ఆదివారం నుంచి  నెలాఖరు వరకు, బెజ్జూర్ మండల కేంద్రంలో ఈ నెల 14 నుంచి పది రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ కోసం  తీర్మానం చేశారు. నిర్మల్​ జిల్లాలోని ఖానాపూర్​ పట్టణంతోపాటు 60 గ్రామాల్లో లాక్‍డౌన్​ పెట్టుకున్నారు. లాక్​డౌన్​ నిబంధనలను అతిక్రమిస్తే  రూ. 500 ఫైన్​ వేస్తున్నారు. 
  • మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపేట, మ్యాదరిపేట, ముత్యంపేట గ్రామాల్లో ఏప్రిల్ 16 నుంచి వ్యాపారులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నారు. గత నెల రోజులుగా మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం, వరుస మరణాల నేపథ్యంలో వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరికి పోలీసులు అన్ని విధాలా సహకరించి షాపులు బంద్ చేయిస్తున్నారు. గత నెల 26 నుంచి ఈ నెల ఒకటి వరకు జన్నారం మండల కేంద్రంలో, ఈ నెల ఒకటి నుంచి 6 వరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ పాటించారు. చెన్నూరు, బెల్లంపల్లిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆరు రోజుల లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ పాక్షిక స్పందన కనిపిస్తోంది. హజీపూర్ మండలం నర్సింగపూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
  • మెదక్​ జిల్లాలోని మెదక్​ టౌన్​తో పాటు చేగుంట, కౌడిపల్లి, నిజాంపేట మండల కేంద్రాలు, కొల్చారం మండలం రంగంపేటలో  15 రోజులుగా పాక్షిక లాక్​ డౌన్​ అమలవుతోంది. మధ్యాహ్నం కల్లా దుకాణాలు బంద్​ పెడుతున్నారు. పెద్ద శంకరంపేటలో ఫుల్​ లాక్​ డౌన్​ విధించుకున్నారు.​ సంగారెడ్డి జిల్లా ఇప్పటివరకు సదాశివపేట  మున్సిపాలిటీతో పాటు 8 గ్రామ పంచాయతీల్లో ​లాక్ డౌన్ పాటిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ లో  సెల్ఫ్ లాక్ డౌన్ అమలవుతుండగా, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీల పరిధిలో వారాంతపు లాక్ డౌన్  అమలుచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 25 కు పైగా గ్రామాల్లో లాక్ డౌన్ విధించుకున్నారు. 
  • వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ముందరి తండాలో కేవలం 600 జనాభా ఉంది. ఏకంగా 100కు పైగా కరోనా కేసులు రావడంతో గ్రామ సర్పంచ్ జయంతి పది రోజుల పాటు ఫుల్​ లాక్​డౌన్​ విధించారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 50 వరకు గ్రామాలు, 4 మండల కేంద్రాలు, 3 పట్టణాల్లో సెల్ఫ్​  లాక్​డౌన్​ పాటిస్తున్నారు. ధన్వాడలో దాదాపు 15 రోజులుగా లాక్​డౌన్ అమలవుతోంది. ఉదయం 5 నుంచి 11 గంటల వరకే షాపులు తెరుస్తున్నారు. 
  • కరీంనగర్ జిల్లాలోని 58 గ్రామాల్లో సెల్ఫ్ లాక్ డౌన్  పాటిస్తున్నారు. మానకొండూర్ మండల కేంద్రంలో కిరాణా షాపులు, వాటర్ ప్లాంట్లు, కూరగాయల మార్కెట్లకు ఉదయం 5 నుంచి 11 వరకే అనుమతి ఇచ్చారు. చొప్పదండి మున్సిపాలిటీలో ఏప్రిల్ 20 నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ టౌన్​లో 200కుపైగా యాక్టివ్​ కేసులున్నాయి. సుమారు 20 మందికి వరకు చనిపోయారు. మధ్యాహ్నం1 తర్వాత షాపులు తెరిస్తే రూ.2 వేలు ఫైన్ వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 215 గ్రామ పంచాయతీలకు గాను 120 గ్రామాల్లో సెల్ఫ్​ లాక్​డౌన్​  ప్రకటించుకున్నారు. సుల్తానాబాద్ పట్టణంలో పాటు కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, ఓడెడ్, ఓదెల, జూలపల్లి మండల కేంద్రాల్లోనూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే షాపులు, ఆటోలు నడుస్తున్నాయి. శంకరపట్నంలోనూ లాక్​డౌన్​కు నిర్ణయం తీసుకున్నారు.
  • ఖమ్మం జిల్లాలోని కల్లూరు, ఎర్రుపాలెం, పెనుబల్లి మండలం వీఎం బంజరలో, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఇల్లెందు, దమ్మపేట మండలం మందలపల్లి, అశ్వారావుపేట, ముల్కలపల్లి, చంద్రుగొండ, చర్లతో పాటు సత్యనారాయణపురం, టేకులపల్లి మండలం మేళ్లమడుగు ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లాక్​ డౌన్​ అమలవుతోంది.
  • వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ సెల్ఫ్ లాక్ డౌన్ పెట్టుకుంటున్నారు. ఎల్కతుర్తి, కమలాపూర్ మండల కేంద్రాల్లో రెండు రోజులుగా లాక్ డౌన్ అమలు అవుతోంది. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, మరిపెడ పట్టణాలతో పాటు సుమారు 50 గ్రామాల్లో పాక్షిక లాక్​డౌన్​ అమలవుతోంది. 
  • నల్గొండ జిల్లా దామరచర్ల, సూర్యాపేట జిల్లా కోదాడ, మునగాల, నడిగూడెం మండల కేంద్రాల్లో గత నెల 23 నుంచి సెల్ఫ్ లాక్ డౌన్ పెట్టుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి షాపులు బంద్​ చేయడంతో వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు 90 శాతం వరకు రాకపోకలు తగ్గిపోయాయి. 
  • వికారాబాద్​ జిల్లా తాండూరులో ఈ నెల 11 నుంచి 24 వరకు 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చెప్పారు. ఆదివారం తాండూరులోని వ్యాపారస్తులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కిరాణా, నిత్యావసర వస్తువుల షాపులు ఉదయం 6  నుంచి 12 గంటల వరకు మాత్రమే తెరిచే ఉంటాయన్నారు.  
  • భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో లాక్​డౌన్​ అమలవుతోంది.  ఇక్కడి కాళేశ్వరం టెంపుల్​ను  10 రోజులు బంద్​ పెట్టారు. ప్రస్తుతం పరిమిత సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో 12, ములుగు జిల్లాలో 7 గ్రామాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నారు.

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో సుమారు 

45 వేలకు పైగా జనాభా ఉంది. రోజూ 30 నుంచి 40 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణ మర్చంట్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుంచి 20 వరకు సెల్ఫ్​ లాక్​డౌన్ విధించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతున్నారు. నిబంధనలు పాటించని వారికి వెయ్యి రూపాయల ఫైన్​ వేస్తున్నారు.

చుట్టూ లాక్​డౌన్ రాష్ట్రాలే 

కరోనా కట్టడి కోసం మన చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ లాక్​డౌన్​ అమలు చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ లాక్​డౌన్​ పెట్టారు. ఆంధ్రప్రదేశ్​లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్​ పెడ్తున్నారు. ఇప్పటికే  కేరళలో లాక్​డౌన్​ కొనసాగుతుండగా.. కర్నాటక, తమిళనాడులో సోమవారం నుంచి అమలులోకి రానుంది. మనకు పొరుగునే ఉన్న మహారాష్ట్రతోపాటు చత్తీస్​గఢ్​ లోనూ లాక్​డౌన్ పెట్టారు. మన రాష్ట్రంలో మాత్రం నైట్ కర్ఫ్యూ విధించారు. అది కూడా హైకోర్టు ఆదేశించడంతోనే.

35 రోజుల నుంచి..

మా ఊర్ల వందల కేసులు వచ్చేవి. ఇప్పటికే నలుగురు చనిపోయిన్రు. దీంతో 35 రోజులుగా ఊర్ల సెల్ఫ్​ లాక్​డౌన్​ పెట్టుకున్నం. ప్రజలందరి ఆమోదం మేరకు మొన్నటివరకు మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాపులు తెరిచి ఉంచినం. ఈ ఆదివారం నుంచి ఉదయం 9 గంటలకే క్లోజ్​ చేస్తున్నం. ఆ తర్వాత ఎవరినీ బయటికి రానిస్తలేం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించిన 14 మందికి, 4 షాపులకు వెయ్యి చొప్పున ఫైన్లు వేసినం.
- ఆడెపు శ్రీదేవి, సర్పంచ్, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా

సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ లో గత నెల 30 నుంచి లాక్ డౌన్  అమలు చేస్తున్నారు. ఈ నెల 20 వరకు కొనసాగ నుంది.  లాక్ డౌన్​కు ముందు చేర్యాల మున్సిపాలిటీలో రోజూ 20కిపైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రస్తుతం 10 లోపే వస్తున్నాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన లాక్​డౌన్  సక్రమంగా అమలు జరగడం కోసం మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.

నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో సుమారు 5 వేల జనాభా ఉంది. 50కిపైగా పాజిటివ్​ కేసులు రాగా.. నలుగురు వ్యాపారులు కరోనాతో చనిపోయారు. దీంతో ఇక్కడ ఈ నెల 4 నుంచి సెల్ఫ్​ లాక్​డౌన్​ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని, అవనసరంగా ఎవరినీ బయటకు రానివ్వడం లేదని  సర్పంచ్ బంటు కిరణ్   చెప్పారు. కేసుల నమోదును బట్టి లాక్ డౌన్ కొనసాగిస్తామంటున్నారు.

గ్రేటర్ వరంగల్​లో కేసులు, మరణాలు పెరుగుతుండడంతో పలు డివిజన్లలో కార్పొరేటర్లు సెల్ఫ్​లాక్​డౌన్ కు చొరవ తీసుకుంటున్నారు. 66 వ డివిజన్ హసన్ పర్తిలో  200 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్, లోకల్​ వ్యాపారులు, విద్యావంతులు సమావేశమై.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ అమలు చేయాలని తీర్మానించారు. ఈ నెల 7 నుంచి అమలు అవుతోంది. 46, 64, 37, 38, 41, 42 తదితర డివిజన్లలోనూ స్థానిక కార్పొరేటర్లు అక్కడి వ్యాపారుల సహకారంతో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెల్ఫ్ లాక్ డౌన్  అమలు కోసం ఆదివారం తీర్మానం చేశారు.

లాక్​డౌన్​తో కరోనాను కట్టడి చేసినం

కరోనా సెకండ్ వేవ్  వల్ల మా  గ్రామంలో మూడు రోజుల వ్యవధిలోనే 36 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో వెంటనే పంచాయతీలో తీర్మానం చేసి లాక్ డౌన్  విధించినం.  ప్రస్తుతం 9 యాక్టివ్ కేసులు ఉన్నయ్​.  కరోనా వ్యాప్తి తగ్గింది. ఈ నెల 20 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నం.
- గుంటి లతాశ్రీ, సర్పంచ్, బోయినిపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లా