
- అఘోరికి ఒకరోజు పోలీసు కస్టడీ
- విచారణ అనంతరం షాద్‌నగర్ కోర్టుకు
- అక్కడి నుంచి చంచల్ గూడకు తరలింపు
చేవెళ్ల/షాద్ నగర్, వెలుగు: పూజల పేరుతో మహిళా సినీ నిర్మాతను మోసగించిన అఘోరి(శ్రీనివాస్)ని మోకిలా పోలీసులు ఒక రోజు కస్టడీకి తీసుకొని విచారించారు. అఘోరిని మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇటీవల పిటిషన్ వేయగా, కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతించింది. దీంతో రిమాండ్ ఖైదీగా ఉన్న అఘోరిని శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి మోకిలా పీఎస్‌కు తరలించారు. సీఐ వీరబాబు, డిటెక్టిక్ ఇన్స్పెక్టర్ సమరం రెడ్డి ఆధ్వర్యంలో 2 గంటలపాటు విచారించారు. ప్రగతి రిసార్ట్‌లో మహిళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నావు? ఆమె నుంచి తీసుకున్న రూ.9.80 లక్షలు ఏం చేశావ్? వాడుతున్న కారు ఎవరిది?
చెన్నైకి చెందిన ప్రకాశ్‌తో సంబంధమేంటి? అని పలు ప్రశ్నాలు సంధించారు. అనంతరం అఘోరిని తిరిగి కోర్టులో హాజరుపరిచారు. అయితే, చేవెళ్ల కోర్టు ఇన్చార్జి జడ్జి కొత్త రవి షాద్‌నగర్ కోర్టులో కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలించి, అఘోరికి మరో 14 రోజుల రిమాండ్ పొడిగించారు. దీంతో అఘోరిని మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలించారు. షాద్ నగర్ కోర్టుకు అఘోరిని తీసుకువస్తున్నారని తెలియడంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అనుమతించలేదు.