పాపం ఇలా పండింది : నోట్ల కట్టలతో ఫ్యామిలీ సెల్ఫీలు.. అడ్డంగా దొరికిన పోలీస్..

పాపం ఇలా పండింది : నోట్ల కట్టలతో ఫ్యామిలీ సెల్ఫీలు.. అడ్డంగా దొరికిన పోలీస్..

ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుగా పెట్టుకుని కొందరు అక్రమార్కులు చేసే పనులు తరచూ వార్తల్లో చూస్తుంటాం.  అక్రమ ఆస్తులు కలిగి ఉన్న వారిని దర్యాప్తు చేసి పోలీసులు పట్టుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఉత్తర్​ప్రదేశ్​లో ఓ భార్య స్వయంకృతాపారాధ ఘటన ఏకంగా ఎస్​ఐని పట్టించింది. రూ.14 లక్షల నోట్ల కట్టలతో దిగిన సెల్ఫీ ప్రభుత్వోద్యోగి బండారం బయటపెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఉన్నావ్​ జిల్లా బెహతా ముజావర్​ పోలీస్​ స్టేషన్​లో రమేష్​ చంద్ర సహాని ఎస్​ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన భార్య, అతని పిల్లలు  వారి ఇంట్లో ఉన్న రూ.500 నోట్ల కరెన్సీ కట్టలతో సెల్ఫీ తీసుకున్నారు. 

ఆ  సెల్ఫీని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. ఇంకేముందీ ఆ పోస్ట్​ కాస్తా వైరల్​గా మారింది. పోలీస్​ ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. సహానిపై విచారణకు ఆదేశించారు. అనంతరం అతన్ని మరో ప్రాంతానికి బదిలీ చేశారు.  అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలో రూ.14 లక్షల విలువైన నగదును ఒక బెడ్‌పై పెట్టి..  ఆ నోట్ల కట్టల పక్కన అతని భార్య , ఇద్దరు పిల్లలు కూర్చోని ఫొటోలకు స్టిల్‌ ఇచ్చారు.  ఎస్‌ఐ సహాని  మాట్లాడుతూ.. ఆ ఫోటో నవంబర్ 14, 2021 నాటిదని.. తన ఆస్తి అమ్మినప్పుడు వచ్చిన డబ్బని  వివరణ ఇచ్చారు.