హైదరాబాద్, వెలుగు: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లోని ప్రీ యూనివర్సిటీ కోర్సులో సెమిస్టర్ విధానం రద్దు చేయాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ల భారం తగ్గించుకునేందుకేనని విద్యార్థులు విమర్శిస్తుండగా.. పరీక్షల టెన్షన్ నుంచి స్టూడెంట్లకు విముక్తి కల్పించేందుకేనని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఫ్యాకల్టీతో వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ వెంకటరమణ నిర్వహిస్తున్న సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఈ విద్యా సంవత్సరం నుంచే?
ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో రెండేండ్లు పీయూసీ కోర్సు, నాలుగేండ్లు ఇంజినీరింగ్ క్లాసులు ఉంటాయి. అప్పట్లో పీయూసీకి కూడా ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈల నుంచి సేకరించిన ప్రత్యేక సిలబస్ ఉండేది. ప్రతి వీకెండ్లో ల్యాప్‌టాప్‌లోనే పరీక్ష ఉండేది.2014లో పీయూసీ కోర్సులో ఇంటర్ సిలబస్ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ సిలబస్‌నే రెండు భాగాలుగా మార్చి, సెమిస్టర్ వారీగా క్లాసులు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్‌చార్జ్ వీసీగా రాహుల్‌బొజ్జా ఉన్నప్పుడు పీయూసీ ఎగ్జామ్స్, కరికులమ్‌లో మార్పులు తీసుకురావాలని వర్సిటీ ఈసీలో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఈ విద్యాసంవత్సరం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. సోమవారం నుంచి పీయూసీ ఫస్టియర్ స్టూడెంట్లకు క్లాసులు ప్రారంభం కానున్నాయి.
సెమిస్టర్లే బెటర్: స్టూడెంట్లు
ఏడాదికోసారి పరీక్షల వల్ల పిల్లలకు పరీక్షల నుంచి ఉపశమనం లభిస్తుందని, అందుకే సెమిస్టర్ విధానం రద్దు చేయాలని అనుకుంటున్నామని ‘వెలుగు’కు వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ వెంకటరమణ చెప్పారు. అయితే స్టూడెంట్లకు ఏది మంచిదని భావిస్తే దాన్నే అమలు చేస్తామన్నారు. కానీ స్టూడెంట్లు మాత్రం ఈ నిర్ణయం వెనుక ల్యాప్‌టాప్‌లు ఎగ్గొట్టే యోచన ఉందని ఆరోపిస్తున్నారు.
