
- రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చిన దక్షిణ కొరియా కంపెనీ
- మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ
- ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు కానుంది. రూ.890 కోట్లతో సెమీ కండక్టర్ ఔట్ సోర్సింగ్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఒసాట్) ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అనే సంస్థ ముందుకొచ్చింది. బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏ ప్యాక్ట్ అనే సంస్థతో కలిసి సెమీ కండక్టర్ ఒసాట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఇండియా సెమీ కండక్టర్ మిషన్‌లో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, అనుమతుల కోసం వేచి చూస్తున్నది. కాగా, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనువైన రాష్ట్రమని సంస్థ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని ఆయన చెప్పారు.
మంత్రితో జపాన్ సంస్థ ప్రతినిధులు భేటీ..
మంత్రి శ్రీధర్ బాబుతో జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ మారుబెని కార్పొరేషన్ ప్రతినిధులు కూడా సమావేశమయ్యారు. హై టెక్నాలజీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సంస్థ ప్రతినిధులకు మంత్రి వివరించారు. పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. పెట్టుబడులతో వస్తే సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.