టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర దాడులు చేస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో దేశ సరిహద్దులను రక్షించడం కోసం చెక్ పాయింట్ల వద్దకు తమ పిల్లలను పంపాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం పిలుపునిచ్చింది. సరిహద్దులను రక్షించడానికి, చెక్ పాయింట్ల వద్ద కాపలా ఉండటానికి తమ పిల్లలను పంపాలని ఈ మేరకు ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) చెందిన బాసిజ్ వాలంటీర్ గార్డ్ సర్వీస్ జనరల్ హుస్సేన్ యెక్తా ప్రభుత్వ టెలివిజన్ ద్వారా తల్లిదండ్రులను కోరారు.
‘మీ అబ్బాయి నిజమైన మగాడు కావాలనుకుంటున్నారా..? యుద్ధభూమి నడిబొడ్డున నిలబడి ఒక హీరోలా అనుభూతి చెందనివ్వండి. తల్లులు, తండ్రులు.. రాత్రి వేళల్లో మీ పిల్లలను చెక్ పాయింట్ల వద్ద కాపలాకు పంపండి. అప్పుడే వారు మగాళ్లుగా ఎదుగుతారు. అమ్మలు, నాన్నలు.. మీ పిల్లల చేతులు పట్టుకుని వీధుల్లోకి రండి’ అని ఆయన కోరారు.
ఐఆర్జీసీకి చెందిన ‘గ్రేటర్ టెహ్రాన్ ముహమ్మద్ రసూలుల్లా కోర్’ సభ్యుడు రహీమ్ నదాలీ గత నెలలో మాట్లాడుతూ.. ‘హోంల్యాండ్ డిఫెండర్ ఫైటర్స్ ఫర్ ఇరాన్’ అనే చొరవ కింద పిల్లలకు పెట్రోలింగ్, తనిఖీ కేంద్రాల మోహరింపు వంటి వివిధ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. బాసిజ్ అనుబంధ మసీదులు, ప్రభుత్వ మద్దతుదారులు ఉన్న బహిరంగ ప్రదేశాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
