
హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 20, 1946న తమిళనాడులో జన్మించిన విజయనిర్మల ‘మత్స్యరేఖ’ అనే తమిళ చిత్రం ద్వారా ఏడేళ్ల వయసులో తెరంగేట్రం చేశారు. బాలనటిగా ఆమె తొలి తెలుగు సినిమా ‘పాండురంగ మహత్యం’. కథానాయికగా ఆమె తొలి తెలుగు సినిమా ‘రంగుల రాట్నం’. తెలుగులో ఆఖరిగా ‘శ్రీశ్రీ’లో కనిపించారు. అలా ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200 సినిమాల వరకు నటించారు.
నటిగానే కాకుండా దర్శకురాలిగానూ ఆమె వెండితెరపై తనదైన ముద్ర వేశారు. ‘మీనా’ సినిమాతో దర్శకురాలిగా మారిన విజయనిర్మల 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. అలా అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. తెలుగు సినిమాకు ఆమె చేసిన సేవలకుగాను 2008లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు.
విజయనిర్మల పార్థివ దేహాన్ని ఈ రోజు 11 గంటలకు నానక్ రామ్ గూడా లోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. ఈ రోజు అంతా అక్కడివుంచి రేపు ఉదయం ఛాంబర్ కు తీసుకువస్తారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు