బంగ్లాదేశ్ పై భారత్ కొత్త ఆంక్షలు.. సరిహద్దు పోర్ట్స్ నుంచి ఆ దిగుమతులు బ్యాన్!

బంగ్లాదేశ్ పై భారత్ కొత్త ఆంక్షలు.. సరిహద్దు పోర్ట్స్ నుంచి ఆ దిగుమతులు బ్యాన్!

పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తోకజాడించినప్పటి నుంచి భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గతంలో ఉన్న ఆంక్షలను మరింత తీవ్రతరం చేస్తోంది మోదీ సర్కార్. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని ల్యాండ్ పోర్టుల ద్వారా బ్లీచ్డ్ ఓవెన్ ఫ్యాబ్రిక్, అన్ బ్లీచ్డ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ దిగుమతులను తాజాగా భారత్ టార్గెట్ చేసింది. 

దీంతో బంగ్లాదేశ్ నుంచి జూట్, తాడు, జనపనారతో చేసిన గోనె సంచులు, పురికొస, కేబుల్స్ వంటి ఉత్పత్తులను భారత సమీపంలోని ఏ ల్యాండ్ పోర్ట్స్ నుంచి దిగుమతులను నిషేధిస్తున్నట్లు డెరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఈ నిబంధనలు వెంటనే అమలులోకి వచ్చాయని అందులో వెల్లడించింది. ఈ ఉత్పత్తులను కేవలం అనుమతించబడిన నవా శేవా ఓడరేవు ద్వారా మాత్రమే దేశంలోకి అనుమతించబడతాయని స్పష్టం చేసింది. 

ఇక రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్ వంటి ఇతర బంగ్లాదేశ్  వస్తువులపై ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్ ఇలాంటి ఆంక్షలు విధించింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఘర్షణ వాతావరణంలో కొత్త నిబంధనలు రావటం ఆందోళనలు పెంచుతోంది. ఈశాన్య రాష్ట్రాలలోని భూ సరిహద్దులను దాటే వాటిపై బంగ్లాదేశ్ కొనసాగుతున్న ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ కొత్త ఆంక్షలను భారత్ ప్రకటించినట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం మే నెల నుంచి బంగ్లాదేశ్ రెడీమేడ్ గార్మెంట్స్ దిగుమతులు కలకత్తా, నవా షెవా పోర్టులకు మాత్రమే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. 

బంగ్లాదేశ్ ఆంక్షలు భారత ఎగుమతుల ఖర్చులను పెంచటంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుండటంతో భారత్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బంగ్లాదేశ్ వైఖరిలో మార్పులు రావటాన్ని భారత ప్రభుత్వ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే కొన్ని నెలల కింద భారత్ తన ఉచిత ట్రాన్స్ షిప్మెంట్ అగ్రిమెంట్ రద్దు చేసింది.