
హైదరాబాద్: మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇవ్వడం కుదరదని, సమీకరణాలు అడ్డొస్తున్నాయనే వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి బీజేపీ నుంచి నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని..? పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని..? అని ప్రశ్నించారు.
ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉంది మీ ప్రవర్తన అని పార్టీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేశారు. మేం ఇద్దరం అన్నదమ్ములం సమర్థులమే. ఇద్దరం గట్టి వాళ్లమే. మాకు ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి పదవి విషయంలో ఆలస్యమైనా సరే ఓపిక పడుతున్నానని అన్నారు.
మంగళవారం (ఆగస్ట్ 12) మునుగోడు మండలం ఎలగలగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్లేనని అన్నారు. తనకు న్యాయం జరగకపోయిన పర్లేదు కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం చేయొద్దని కోరారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు. ఎందుకు కుదరటం లేదు సమీకరణలు..? తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా అని పార్టీ హైకమాండ్‌ను నిలదీశారు.