
సినీ కార్మికుల సమస్యలు ఓ కొలిక్కి రావట్లేదు. తమకు సత్వర న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ 9వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఎక్కడిక్కడ సినిమా షూటింగ్స్ నిలిపివేసి తమ డిమాండ్స్ని నెరవేర్చాలని గళం విప్పుతున్నారు. అయితే, పలువైపుల నుంచి కార్మికుల సమ్మె విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, వారు సమ్మె కొనసాగిస్తూ నిరసన తెలుపుతున్నారు.
ఈ క్రమంలో ఇవాళ (ఆగస్టు 12న) దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు భేటీ అవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం జరిగే చర్చలో సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నారు. మరి ఈ భేటీలో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది.
ఇరువైపులా పట్టు విడుపు ఉండాలి:
నిన్న సోమవారం (ఆగస్టు 11న) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, FDCచైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపారు. ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసి.. ఇరు పక్షాల వారితో చర్చలు జరుపుతామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సినిమా కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని, అలాగే ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు.
అయితే కార్మికులు సమ్మెకు వెళ్లడం సరైన మార్గం కాదని స్పష్టం చేశారు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు,ఫెడరేషన్ సభ్యులకు పట్టు విడుపు ఉండాలని కోరారు. కార్మికులు కూడా చిన్న నిర్మాతల గురించి ఆలోచన చేయాలని, ఏ సమస్యకైనా చర్చలతో పరిష్కారం దొరుకుతుందని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. బుధవారం నుంచి షూటింగ్స్ పునఃప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సినీ రంగ సమస్యలపై రాష్ట్ర స్థాయిలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఫెడరేషన్ నిబంధనలు, సినీ కార్మికుల డిమాండ్స్ చిన్న నిర్మాతలకు పెనుభారంగా మారుతున్నాయని, అందరం బాగుండాలనే ధోరణిలో యూనియన్స్ వ్యవహరించాలంటూ చిన్న చిత్రాల నిర్మాతలు సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్ షో చైతన్య, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.