వయసుపడ్డ పెద్దలు దేశంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించాలని బలంగా కోరుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలతోపాటు ఉత్తరాదికీతీర్థయాత్రలు చేయాలని ఉబలాటపడతారు. ఇలాంటి వారికి రాజస్తాన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వృద్ధులకు ఉచిత ట్రైన్, విమాన సేవలుఅందించాలని రాజస్తాన్ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా తీర్థయాత్రలు చేయాలనుకునే వృద్ధుల నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అయితే ఈ పథకంలో కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను లిస్ట్ ఔట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వృద్ధులకు ఉచితంగా పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశాన్ని రాజస్తాన్ ప్రభుత్వం అందిస్తున్నది. ఆ వృద్ధులు కేవలం రాజస్తాన్ పౌరులైతే చాలు. ఫ్రీ సీనియర్ సిటిజెన్ పిల్‌గ్రిమేజ్ స్కీం2024 కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈ ఏడాదికి రాష్ట్రంలోని 36 వేల మంది వృద్ధులకు ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పించనుంది. ఇందులో 30 వేలమంది వృద్ధులకు ఉచితంగా ట్రైన్ సేవలను, మిగిలిన ఆరు వేల మందికి ఉచిత విమానయాన సేవలను అందించనుంది. ఆయా జిల్లాల్లో ఎంత మంది వృద్ధులు ఈ స్కీం కోసం దరఖాస్తుచేసుకున్నారనేదాని బట్టి.. జిల్లాలకు కోటా నిర్ణయించబడుతుంది.
ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 19. దేవస్థానం డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గత సంవత్సరం దరఖాస్తు చేసుకున్నవృద్ధులు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, దరఖాస్తుదారుల వయసు తప్పకుండా 60 ఏళ్లకుపైబడి ఉండాలి.
ఈ స్కీం కింద ట్రైన్ ద్వారా రామేశ్వరం, మదురై, జగన్నాథ్ పూరి, సోమనాథ్, ప్రయాగ్ రాజ్, తిరుపతి, ద్వారకాపురి, వైష్ణో దేవి, అమృత్ సర్, మథుర బృందావన్ బర్సానా వారణాసి, సమ్మేద్ శిఖార్జీ, పావాపురి, బైద్యనాథ్, ఉజ్జయిన్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, గంగసాగర్, కామాఖ్య, హరిద్వార్, రిషికేశ్, అయోధ్య మధుర, బిహార్ షరీఫ్, వేలంకన్ని చర్చ్‌లను ఉచితంగా రాజస్తాన్ ప్రభుత్వం చూపించనుంది. ఇక కొందరు వృద్ధులు మాత్రం పశపతినాథ్‌కు నేరుగా ఫ్లైట్‌లో ఉచితంగా వెళ్లిరావొచ్చని రాజస్తాన్ ప్రభుత్వం తెలిపింది.