బూర్గుల నర్సింగరావు ఇకలేరు

బూర్గుల నర్సింగరావు ఇకలేరు
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుడు తెలంగాణ  తొలిదశ ఉద్యమంలోనూ కీలక పాత్ర హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు బూర్గుల నర్సింగరావు (89) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి కేర్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. నర్సింగరావు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం12 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. బూర్గుల నర్సింగరావు హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తమ్ముని కొడుకు. ఉమ్మడి మహబూనగర్ జిల్లా షాద్ నగర్ సమీపంలోని బూర్గుల గ్రామంలో పుట్టారు. నిజాం పాలనకు, రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.  నిజాం పాలనకు వ్యతిరేకంగా స్థాపించిన ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్‌లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కోదండరామ్ నేతృత్వంలోని టీజేఏసీ ఆఫీసుకు బూర్గుల నర్సింగరావు తరుచూ వచ్చేవారు. 2013లో ఎల్బీ స్టేడియంలో సీమాంధ్ర నాయకులు నిర్వహించిన సమైక్య సభలో బూర్గుల రామకృష్ణారావు, కొమురంభీం కటౌట్లను పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పెదనాన్న బూర్గుల రామకృష్ణారావు చనిపోయినప్పుడు సీమాంధ్ర పాలకులు సెలవు దినం కూడా ప్రకటించలేదన్నారు.