లెటర్​ టు ఎడిటర్​ : రేడియో.. విజ్ఞాన, వినోద సమ్మేళనం ‌‌: జి. యోగేశ్వర్​ రావు

లెటర్​ టు ఎడిటర్​ : రేడియో.. విజ్ఞాన, వినోద సమ్మేళనం ‌‌:  జి. యోగేశ్వర్​ రావు

రేడియో వైభవం మనిషి జీవితం అంతటి మరపురానిది. పండితులను మాత్రమే కాదు పామరులనూ పలకరించింది. పట్టణాలనే కాదు పల్లె పల్లెనూ తట్టి లేపింది. సామాజిక చైతన్యాన్ని నింపింది.పేదల బడిగా, వైద్యాలయంగా, ప్రార్థనా మందిరంగా పెనవేసుకుపోయింది. కాలక్రమంలో ఎన్నో,  ఎన్నెన్నో ప్రసార సాధనాలు ప్రత్యక్షమయ్యాయి. రేడియోకి ఆదరణ తగ్గుతుందేమో నన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా శ్రోతలకు దగ్గరయింది. మరింత చేరువ అవుతూ పూర్వ వైభవాన్ని తలపిస్తోంది.

కచ్చితత్వం, నిబద్ధత రేడియోకి ఆభరణాలు. ఇవే ప్రామాణికాలు. క్రమశిక్షణ, విజ్ఞానం అందించడంతో పాటు వివిధ కళలపై ఆసక్తిని పెంచడానికి దోహదపడుతోంది రేడియో. ఉదయమే భక్తిరంజనితో ప్రారంభమై, వార్తలు విని, నేటి మాట వంటివి కూడా చెవికి ఎక్కించుకుని జీవితాన్ని మలుచుకోడానికి రేడియో సహాయపడుతోందని ఎందరో సాహితీవేత్తలు అంటుంటారు. వినూత్న బాటలో నడిపిస్తుందనీ, క్రమశిక్షణ అలవాటు చేస్తుందని అభిమానుల ప్రగాఢ విశ్వాసం. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు రేడియో వార్తలనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపిన వారు, ముఖ్యంగా తుపాన్లు, సునామీ వంటి హెచ్చరికలు జారీ అయిన సందర్భాల్లో రేడియోను నమ్మదగిన సాధనంగా పక్కనే ఉంచుకున్నామని అలనాటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని,  జాగ్రత్తపడిన వారూ చెబుతుంటారు.  

దేశంలో రేడియోలో తొలి ప్రసారం 1927 జూలై 23 న బొంబాయి స్టేషన్ నుంచి జరిగింది. ఆల్ ఇండియా రేడియోను అధికారికంగా 1956 నుంచి ఆకాశవాణిగా పిలుస్తున్నారు. ఇది ప్రసారభారతికి సంబంధించిన ఒక విభాగం. ఆల్ ఇండియా రేడియో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థలలో ఒకటిగా పేరు పొందింది. 'బహుజన్ హితాయ: బహుజన్ సుఖాయ '- నినాదానికి అనుగుణంగా శ్రోతలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తుంది రేడియో.


- జి. యోగేశ్వర్​ రావు,
సీనియర్​ జర్నలిస్ట్​