యువత కోసం మై భారత్.. స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయనున్న కేంద్రం

యువత కోసం మై భారత్.. స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయనున్న కేంద్రం
  • దేశవ్యాప్తంగా యూత్ డేటాబేస్ ఏర్పాటు  
  • అన్ని శాఖల స్కీమ్​లూ ఒకే వేదిక నుంచి అందించే చాన్స్  
  • 15---–29 ఏజ్ గ్రూప్ వారికి ప్రత్యేక ప్రోగ్రామ్స్ 
  • పటేల్ జయంతి సందర్భంగా 31న ప్రారంభం 
  • కేంద్ర కేబినెట్ నిర్ణయం 

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా యువతను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వీలుగా ‘మేరా యువ భారత్ (మై భారత్)’ అనే పేరుతో ప్రత్యేక అటానమస్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు మై భారత్ వేదిక ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మీటింగ్ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. నేషనల్ యూత్ పాలసీ ప్రకారం..15 నుంచి 29 ఏండ్ల మధ్య ఉన్న యువత కోసం మై భారత్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాల్లో యువత స్వచ్ఛందంగా పాల్గొనేలా ఈ వేదిక ప్రోత్సహిస్తుందన్నారు.

దేశంలో 15–29 ఏజ్ గ్రూప్ వాళ్లు 27 శాతం (40 కోట్లు) ఉన్నారని.. వీరందరికీ అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోని స్కీంలన్నీ ఒకే వేదికపై నుంచి అందిస్తామన్నారు. యువతీయువకుల్లో స్కిల్స్, నాయకత్వ లక్షణాలు పెంచడం ద్వారా యువత నేతృత్వంలో అభివృద్ధి చెందిన ఇండియాను నిర్మించాలన్నదే ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి (నేషనల్ యూనిటీ డే) సందర్భంగా ఈ నెల 31న ఈ వేదికను ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేలా చేయడం, వారి శక్తిని వినియోగించుకుని అభివృద్ధి చెందిన ఇండియాను నిర్మించే దిశగా ఈ వేదిక పని చేస్తుందన్నారు. యువత అభివృద్ధి కోసం ‘సమగ్రమైన ప్రభుత్వ వేదిక’గా ఇది ఏర్పాటవుతుందన్నారు. ఆయా కార్యక్రమాల అమలు కోసం దేశవ్యాప్తంగా యువత డేటాబేస్ ను ఇందులో పొందుపర్చనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. యువతకు సరైన వనరులు, అవకాశాలు కల్పిస్తే.. సామాజిక మార్పు ప్రతినిధులు, జాతి నిర్మాతలుగా మారతారని.. తద్వారా వారు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ‘యువ సేతు’లా నిలుస్తారన్నారు.   

ఫ్రాన్స్ తో డిజిటల్ టెక్ ఒప్పందం 

డిజిటల్ టెక్నాలజీల్లో సహకారం కోసం ఫ్రాన్స్, పపువా న్యూగినియా, ట్రినిడాడ్ అడ్ టొబాగో దేశాలతో ఇండియా కుదుర్చుకున్న మూడు ఎంఓయూలకు కూడా కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందాలతో ఆయా దేశాలు ప్రభుత్వాలు, కంపెనీల మధ్య డిజిటల్ టెక్నాలజీలపై పరస్పరం సహకారం అందించుకోనున్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఒప్పందాల్లో భాగంగా ఇండియా ఇదివరకే పలు దేశాల్లో యూపీఐ, ఆధా ర్, కొవిన్ వంటి వ్యవస్థలను ప్రారంభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. లిథియం, మరో రెండు మినరల్స్ కు రాల్టీ రేట్లపై కూడా కేబినెట్ ఓకే చెప్పింది. లిథియం, నియోబియంపై 3 శాతం చొప్పున, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై 1 శాతం చొప్పున రాయల్టీ రేట్ కు ఆమోదం తెలిపింది.  

యువత ఆకాంక్షలకు రెక్కలు : మోదీ 

మై భారత్ వేదికను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం యువత నేతృత్వంలో అభివృద్ధికి దీర్ఘకాలంపాటు ఎంతో ఉపయోగ పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని యువత ఆకాంక్షలకు మై భారత్ వేదికతో రెక్కలు తొడిగినట్లు అవుతుందని ఆయన  ట్వీట్ చేశారు.