సన్యాసి వేషంలో ఢిల్లీకి అమృత్​పాల్!

సన్యాసి వేషంలో ఢిల్లీకి అమృత్​పాల్!

న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్​పాల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. సన్యాసి వేషంలో అతను శుక్రవారం ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ బస్ టెర్మినల్ వద్ద దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పంజాబ్, ఢిల్లీ పోలీస్​టీమ్స్ పరిశీలిస్తున్నారు. అతను అమృత్‌‌సర్ నుంచి హర్యానాలోని కురుక్షేత్రకు.. అక్కడి నుంచి దేశ రాజధానికి బయలుదేరినట్లు ఇప్పటి వరకు లభ్యమైన సీసీ ఫుటేజీ వీడియోల ద్వారా స్పష్టమవుతోందని పోలీసుల వర్గాలు చెప్తున్నాయి. అమృత్​పాల్ తన వేషం మార్చుకున్నట్లు తెలుస్తున్నది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో లెదర్​ జాకెట్, బ్లాక్ గాగుల్స్​తో కనిపించాడు. ఈ వీడియో ఈ నెల 20న అమృత్​సర్​లోని ఓ సీసీ కెమెరాలో రికార్డైంది. అక్కడి నుంచి హర్యానాలోని  కురుక్షేత్రలో అమృత్, పాపల్‌‌ప్రీత్ సింగ్‌‌కు ఆశ్రయం కల్పించిన మహిళ బల్జీత్ కౌర్‌‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హత్యాయత్నం, సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలు, చట్టం అమలుకు అడ్డంకులు కలిగించడం.. వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను గత శనివారం నుంచి పరారీలో ఉన్నాడు.