1948, సెప్టెంబర్ 17.. నిజాం పాలన ముగింపు.. అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు..

1948, సెప్టెంబర్ 17.. నిజాం పాలన ముగింపు.. అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో విలీనం కాలేదు. 1948, సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్​లో విలీనం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో 562 సంస్థానాలు ఉండగా, ట్రావెన్​కోర్(కేరళ), జునాగఢ్(గుజరాత్), కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు మినహాయించి మిగతావన్నీ భారత యూనియన్​లో విలీనం అయ్యాయి. పై సంస్థాలన్నింటిలో హైదరాబాద్ సంస్థానం పెద్దది.

1947, జూన్ 12న నిజాం మీర్​ ఉస్మాన్ అలీఖాన్ తాను సర్వస్వతంత్రుడినని ప్రకటించుకున్నాడు. 1947, ఆగస్టు 13న మరోసారి ప్రకటన చేస్తూ హైదరాబాద్ స్వతంత్ర రాజ్యమని పేర్కొన్నాడు. 1947, నవంబర్ 29న భారత ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం మధ్య ఒక సంవత్సరానికి స్టాండ్​స్టిల్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందాన్ని నిజాం ప్రభుత్వం ఉల్లంఘించడంతో భారత ప్రభుత్వం సైనిక చర్యకు ఉపక్రమించింది.

ఆనాటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్​పై సైనిక దాడి చేయడానికి ఒక వ్యూహాన్ని రచించమని అప్పటి సదరన్ కమాండర్ ఇన్ చీఫ్​ ఈఎన్ గొడార్డ్​ను ఆదేశించాడు. ఆయన దాడి ప్రణాళికను రూపొందించి పటేల్​కు ఇచ్చాడు. ఈ విషయాన్ని పసిగట్టిన నిజాం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేయడానికి ఒక బృందాన్ని పంపాడు. ఈ బృందానికి అప్పటి హైదరాబాద్ విదేశాంగ మంత్రి మొయిన్ నవాజ్ జంగ్ నాయకత్వం వహించాడు. అంతకుముందు 1948, ఆగస్టు 21న నిజాం ప్రభుత్వం కేబుల్ గ్రామ్ ద్వారా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 35 (2) ప్రకారం భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది. ఐక్యరాజ్యసమితిలో నిజాం ప్రభుత్వానికి సహకరించడానికి సర్ వాల్టర్ మోంక్టన్​ను నియమించారు.

భారత ప్రభుత్వం కూడా మద్రాసుకు చెందిన రామస్వామి మొదలియార్ నేతృత్వంలో ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించింది. హైదరాబాద్ రాజ్య విలీనాన్ని ఆపడానికి నిజాం వివిధ దేశాల మద్దతు కోరుతూ లేఖలు రాశాడు. బ్రిటీష్ చక్రవర్తి ఆరో జార్జ్,  ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ, ప్రతిపక్ష నాయకుడు విన్​స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ట్రూమన్​కు నిజాం వ్యక్తిగతంగా లేఖలు రాసి సహాయం అభ్యర్థించాడు. నిజాం చర్యలతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భారతప్రభుత్వం సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చింది. నిజాంకు మద్దతుగా నిలిచే మహమ్మద్ అలీజిన్నా 1948, సెప్టెంబర్ 11న మృతిచెందిన రెండు రోజులకే నిజాం రాజ్యంపైన సైనిక చర్య చేపట్టారు. 1948, సెప్టెంబర్ 13 నుంచి 17  మధ్య కొనసాగిని సైనిక చర్యను ఆపరేషన్ పోలో, ఆపరేషన్ కాటర్ పిల్లర్, గొడార్డ్ ప్లాన్ అని పిలిచారు.

ఆపరేషన్ పోలో
హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టులు, రజాకార్లు కొనసాగిస్తున్న హింస ప్రతిహింసలకు వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో నిర్వహించబోతోందని పాకిస్తాన్ హైకమిషనర్​కు, అమెరికా ప్రభుత్వానికి భారత ప్రభుత్వం తెలిపింది. అయితే, హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టినా దానికి పోలీసు చర్య అని పేరు పెట్టడానికి కారణం ఒక స్వతంత్ర రాజ్యంపై మరో స్వతంత్ర రాజ్యం సైనిక చర్య చేపట్టడం ఐక్యరాజ్యసమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం.

కాబట్టి ఇందుకు సాక్ష్యాలు లేకుండా ఉండటానికి ఆపరేషన్ పోలో సమయంలో సైన్యానికి అయ్యే ఖర్చును  విద్యాశాఖ ఖజానాలో జమ చేశారు. ఈ సైనిక చర్యకు పోలీసు చర్య అని సి.రాజగోపాలాచారి పేరు పెట్టారు. దీనినే మిలటరీ భాషలో ఆపరేషన్​  పోలో అని పేర్కొన్నారు. ఈ పోలీస్ చర్య సంపూర్ణంగా సదరన్ కమాండ్(దక్షిణ కమాండ్)కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ మహరాజ రాజేంద్రసింగ్ నేతృత్వంలో జరిగింది.

నలువైపుల నుంచి దాడి
మహరాజ రాజేంద్రసింగ్ సైన్యాన్ని షోలాపూర్– జేఎన్ చౌదరి, విజయవాడ–ఏఏ రుద్ర, బేరార్/ హోస్పేట– శివదత్తుసింగ్, బొంబాయి – డి.ఎస్.ధార్ యూనిట్లుగా విభజించాడు. పుణె ఎయిర్ బేస్​ను యుద్ధ విమానాల ద్వారా దాడి చేయడానికి ఉపయోగించారు. ఈ వైమానిక దళానికి ముఖర్జీ నాయకత్వం వహించాడు. 1948, సెప్టెంబర్ 13 తెల్లవారుజామున హైదరాబాద్​కు అన్ని వైపుల నుంచి సైనిక దాడులు ప్రారంభమయ్యాయి. 

సెప్టెంబర్ 13న జె.ఎన్.చౌదరి నాయకత్వంలోని స్ట్రయిక్ ఫోర్స్ లెఫ్టినెంట్ కర్నల్ రామ్ సింగ్ మహారాష్ట్రలోని నల్ దుర్గ్, షోలాపూర్, తామల్​వాడి, తుల్జాపూర్​లను ఆక్రమించాడు. సెప్టెంబర్ 13న రుద్ర నాయకత్వంలో బోనకల్లును ఆక్రమించారు.  సెప్టెంబర్ 14న భారత సైన్యం దౌలతాబాద్, జాల్నా, మనిక్​ఖేడ్, కన్నెగావ్​లను ఆక్రమించాయి. సెప్టెంబర్ 15న మేజర్ జనరల్ రుద్ర నాయకత్వంలోని సైన్యాలు పాత సూర్యాపేట గ్రామంలోకి ప్రవేశించాయి. సెప్టెంబర్ 16 నాటికి జహీరాబాద్, హింగోలీ, రాయ్​చూర్, పర్బనీ, కొప్పల్, మునీరాబాద్ తదితర పట్టణాలన్నీ భారత సేనల  వశమయ్యాయి. 

భారత్కు సహకరించిన ఎడ్రూస్
భారత సైన్యానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించిన నిజాం రాజ్య మిలటరీ కమాండర్ సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రూస్ భారత సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయకుండా హైదరాబాద్ నగరానికి తిరిగి రావాలని కింది స్థాయి సైనికాధికారులకు రహస్యంగా ఆదేశాలు పంపించాడు. దీంతో స్వల్ప సమయంలోనే హైదరాబాద్ నగరంలోకి మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలోని సేనలు ప్రవేశించాయి. ఒకవేళ ఎడ్రూస్ అలాంటి పనిచేయకపోతే భారత సైన్యం సెప్టెంబర్ 17లోగా హైదరాబాద్ నగరంలోకి రాలేకపోయేది. దాంతో సెప్టెంబర్ 17 సాయంత్రం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో హైదరాబాద్ అంశం చర్చకు వచ్చి నిజాం రాజ్యం స్వతంత్ర రాజ్యంగా లేదా ఒకప్పటి జమ్మూకాశ్మీర్ లాగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది.

తన పదవికి రాజీనామా చేసిన నిజాం రాజ్య ప్రధాని మీర్ లాయక్ అలీ సలహా ప్రకారం నిజాం, ప్రధాని కార్యాలయాల్లోని రహస్య పత్రాలన్నింటిని ధ్వంసం చేయించారు. పాకిస్తాన్ లో హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ముష్తాఖ్ అహ్మద్ ఖాన్ కు ఆయన ఆఫీసుకు చెందిన మొత్తం డబ్బును తన అకౌంట్ లో జమ చేసుకోమని, లండన్ లోని ఏజెంట్ జనరల్ మీర్ నవాబ్ జంగ్ కు 5000 పౌండ్లు తన అకౌంటులో జమ చేసుకోమని టెలిగ్రామం ద్వారా లాయక్ అలీ వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారిద్దరి అకౌంట్ల నుంచి డబ్బును తన పేర జమ చేయాలని కూడా లాయక్ అలీ ఆదేశించాడు. ఆ డబ్బు భవిష్యత్తులో స్వాత్రంత్ర్య పోరాటానికి అవసరమవుతుందని కూడా తెలిపాడు.

సెప్టెంబర్ 13న దాడులు ప్రారంభించిన భారత సైన్యం సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్​లోకి ప్రవేశించాయి. దీంతో ఉస్మాన్ అలీఖాన్ 1948, సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్​లో ఉన్న కె.ఎం.మున్షీని కలిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్​కు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం 7 గంటలకు దక్కన్ రేడియో నుంచి భారత గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి పేరు మీద ప్రకటన చేస్తూ హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగమైందని ప్రకటించాడు. అంతేకాకుండా భారత సైన్యాలను బొల్లారం, సికింద్రాబాద్ లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతి ఇస్తున్నానని పేర్కొన్నాడు.   

నిజాం రేడియో ప్రకటనతో సైనిక దాడి నిలిచిపోయి 1948, సెప్టెంబర్ 17న నిజాం పాలన అంతమైంది. సెప్టెంబర్ 18న హైదరాబాద్ సైన్యాధిపతి ఎడ్రూస్ తన మొత్తం సైన్యంతో భారత మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి ఎదుట లొంగిపోయాడు. మిలటరీ నియమాల ప్రకారం హైదరాబాద్ను మొదట చేరుకున్న జనరల్ జె.ఎన్.చౌదరిని హైదరాబాద్ మిలటరీ గవర్నర్గా నియమించారు. సెప్టెంబర్ 18న రజాకార్ల నాయకు డు ఖాసీం రజ్వీని అరెస్టు చేసి తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించారు. మీర్ లాయక్ అలీని గృహ నిర్బంధం చేశారు. సెప్టెంబర్ 18న హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్​కు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికాడు.