చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలశాయాల్లో ఒకటైన గండిపేట (ఉస్మాన్ సాగర్) రిజర్వాయర్లో సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలు పారబోస్తుండగా అధికారులు పట్టుకున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హిమాయత్ నగర్ సమీపంలో ఎఫ్టీఎల్ పాయింట్ నంబర్ 428 వద్ద బుధవారం ఉదయం సెప్టిక్ ట్యాంకర్ వ్యర్థాలను పారబోస్తుండగా స్థానికులు గమనించారు.
వెంటనే అధికారాలకు సమాచారం ఇవ్వగా, పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకొని పట్టుకున్నారు. డ్రైవర్ను విచారించగా హైదరాబాద్ సైదాబాద్ ఏరియాలోని సింగరేణి కాలనీకి చెందిన రామావత్ శివ నాయక్ గా గుర్తించారు. అనంతరం వాటర్ బోర్డు ఎస్బీ ఉస్మాన్ నగర్ సెక్షన్ డీజీఎం(ఈ) నరహరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజలు తాగే నీటిలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు కలుపుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.
