తెలంగాణలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుస్తుంది

తెలంగాణలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నడుస్తుంది

రాష్ట్రంలో ఏర్పడ్డ శాంతీయుత వాతావరణంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. రవీంద్రభారతీలో జరిగిన పోలీస్ మెడల్స్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి…పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. టెక్నాలజీ వాడకంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ లో రాష్ట్ర పోలీసులు ముందున్నారని చెప్పారు.

విధుల్లో విశిష్ట సేవలందించిన 418 మంది పోలీస్ అధికారులకు హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలు మెడల్స్ అందజేశారు. ప్రెసిడెంట్ గ్యాలంటరీ, పీఎం సర్వీస్, మహోన్నత సేవా, రాష్ట్ర శౌర్య, రాష్ట్ర సర్వోన్నత సేవా విభాగాలతో పాటు పలు విభాగాల్లో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు మెడల్స్ అందుకున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. పోలీస్ శాఖకు ఎన్నడూ లేనంతగా నిధులను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర పోలీస్ శాఖలో కొత్తగా 18 వేల మంది సిబ్బంది నియామకం పూర్తయిందని.. ఈ నెల 17 నుంచి ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు.  మెడల్స్ పొందిన అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు . ఈ పురస్కారాలతో మరింత ఉత్సాహంగా సేవలు అందించాలని కోరారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు డ్యూటీ చేస్తున్నారని చెప్పారు.

పతకాలను అందుకున్నవారిలో ముగ్గురు అడిషనల్ డీజీపీలు, ఇద్దరు ఐజీలు, ముగ్గురు డీఐజీలు, ముగ్గురు ఎస్.పీ లతో పాటు 10 మంది నాన్ క్యాడర్ ఎస్.పీలు, 29 మంది అడిషనల్ ఎస్పీలు, 53 మంది డీఎస్పీలు, 48 మంది ఇన్ స్పెక్టర్లు, 59 మంది ఎస్ఐలు, 76 మంది ఏఎస్ఐలు, 87 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 47  మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.