న్యూఢిల్లీ: అమెరికా సుప్రీంకోర్టులో తమకు చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలిందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ (సీఎస్సీ), డీఎక్స్‌సీ టెక్నాలజీ సంస్థతో నడుస్తున్న వాణిజ్య రహస్యాల వివాదంలో దిగువ కోర్టు తీర్పును సమీక్షించడానికి అక్కడి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో టీసీఎస్ అదనంగా 70 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,880 కోట్లు) కేటాయించనుంది. ఈ మొత్తాన్ని 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఒకేసారి వచ్చే అసాధారణ వ్యయంగా చూపించనుంది. ఈ వివాదానికి సంబంధించి కంపెనీ బుక్స్‌లో 150 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 12,600 కోట్లు) కేటాయించింది.
అమెరికా కోర్టు గతంలో టీసీఎస్ సంస్థకు 194.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 16,312 కోట్లు) జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై కంపెనీ చేసిన అప్పీలును అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
