బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తమ్ముడికి అగ్గువకే ఏడెకరాలు లీజ్​

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తమ్ముడికి అగ్గువకే ఏడెకరాలు లీజ్​
  • నోటిఫికేషన్​, టెండర్​ లేకుండానే  30 ఏండ్లకు అగ్రిమెంట్
  • నెలకు రూ.50 లక్షల రెంట్ రావాల్సిన చోట రూ.2 లక్షలకే అప్పగింత
  • పైగా ఇతర అవసరాలకు వాడుకునేలా ప్రత్యేక వెసులుబాటు
  • ప్రభుత్వ ఖజానాకుఏటా రూ.5.7 కోట్లు లాస్​

హైదరాబాద్, వెలుగు:  అదో ప్రభుత్వరంగ సంస్థ జాగ. హైదరాబాద్ –విజయవాడ హైవేకు సమీపంలో ఉంది. ఇంకేముంది.. దానిపై ఓ ఎమ్మెల్సీ కన్నుపడింది. తన తమ్ముడి కం పెనీకి ఆ భూమి లీజు దక్కేలా ఆయన పావులు కదిపారు. సదరు ఎమ్మెల్సీ ప్రభుత్వంలో కీలకంగా ఉండటంతో వ్యవహారన్నంతా అధికారులు దగ్గరుండి చక్కబెట్టారు. నోటిఫికేషన్​ కానీ, టెండర్ కానీ లేకుండా దాదాపు రూ. 200 కోట్ల విలువైన ఏడు ఎకరాల భూమిని 30 ఏండ్లకు లీజ్​కు ఇచ్చేశారు.

అదీ మస్తు అగ్గువకు. నెలకు రూ. 50 లక్షల రెంట్​ వచ్చే ఆ భూమిని రూ. 2 లక్షలకే ఫైనల్ చేసి అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా సదరు కంపెనీ లీజ్​కు తీసుకోవడమే కాకుండా.. ఆ స్థలాన్ని ఇతరులకు రెంట్ రూపంలో ఇచ్చేందుకు, ఇతరత్రా అవసరాలకు వాడుకునేందుకు అగ్రిమెంట్​ కూడా చేసుకుంది. ఇదంతా తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్  భూమిలో సాగిన దందా. ఆ పెద్దాయన.. ఎమ్మెల్సీ మాత్రమే కాదు.. రాష్ట్రంలో పలు విద్యాసంస్థలు నడుపుతుంటారు. రైతులకు సంబంధించిన ఓ కార్పొరేషన్​కు చైర్మన్​గా కూడా ఉన్నారు. 

ఏడాదికి రూ.6 కోట్లు లాస్

తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్​కు హైదరాబాద్​ శివారులోని పహడీషరీఫ్ – మామిడిపల్లి దగ్గర 7 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఇటీవల రీడర్స్ స్టోర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​కు ఎలాంటి పేపర్ నోటిఫికేషన్, టెండర్  లేకుండానే లీజుకు అప్పగించారు. సాధారణంగా సివిల్ సప్లయ్స్ వద్ద ఉన్న వడ్లు, మార్క్​ఫెడ్ కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను వివిధ ప్రైవేట్ గోడౌన్లలో నిల్వ చేయాల్సిన పరిస్థితి వస్తే  స్క్వేర్ ఫీట్​కు  ప్రభుత్వం రూ.15 నుంచి  20 చెల్లిస్తుంది. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్​కు  7 ఎకరాల ల్యాండ్.. అంటే 3.04 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంది. ఇంత మొత్తం స్థలాన్ని నెలకు కేవలం రూ.2 లక్షలు రెంట్ చెల్లించేలా లీజుకు ఇచ్చేశారు.

అంటే సంవత్సరానికి కేవలం రూ. 24 లక్షలు వస్తుంది. అదీ 30 ఏండ్లకు రూ.7.20 కోట్లు మాత్రమే. భవిష్యత్తులో కొంత పెంచినా అదీ రూ. 10 కోట్లు మించదు. అదే ప్రభుత్వం బయట రెంట్ తీసుకున్నట్లు ఇక్కడ రేటు కడితే నెలకు రూ. 50 లక్షల దాకా అవుతుంది. అంటే సంవత్సరానికి  రూ. 6 కోట్లు పైనే వస్తుంది. ఈ లెక్కన 30 ఏండ్లకు రూ.180 కోట్లు రావాలి. కానీ, 30 ఏండ్లకు ఏకంగా రూ.172 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు లాస్​ వస్తుంది. ఏడాదికి రూ. 5.7 కోట్ల లాస్ వస్తుంది.  ఆ ల్యాండ్ విలువ కూడా ఎకరానికి రూ.25 కోట్ల పైన ఉన్నట్లు తెలుస్తున్నది. 

చెప్పిందొక్కటి.. చేసేదొకటి..!

స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్​కు చెందిన ఏడు ఎకరాల ల్యాండ్​ను ముందుగా కొంత అమౌంట్ ఖర్చు చేసి డెవలప్​మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే అనుకున్నది. అయితే.. ఆ విలువైన భూమిని తన తమ్ముడి కంపెనీకి అప్పగించాలన్న ఉద్దేశంతో డెవలప్​మెంట్​ ప్రతిపాదనలను సదరు ఎమ్మెల్సీ పక్కన పడేయించారు. ఈ భూమిలో పేపర్ మిల్లు లేదా బుక్ ప్రింటింగ్ చేసుకుంటామని ముందుగా చెప్పారు. అయితే.. అదీ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా పర్మినెంట్ స్ట్రక్చర్​తో పాటు ఇతర అవసరాలకు వాడుకునేలా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్​లో మార్పులు చేసి ఆమోదింపజేసుకున్నారు. వాస్తవానికి కంటైనర్ ప్రైడ్ స్టేషన్ కోసమే ఆ భూమిని వాడుకోవాలని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ బోర్డు స్పష్టం చేసింది. అయినా అందులో మార్పులు చేశారు.