నాందేడ్ ఆస్పత్రిలో మరో ఏడుగురు మృతి

నాందేడ్ ఆస్పత్రిలో మరో ఏడుగురు మృతి
  • రెండ్రోజుల్లో 31 మంది.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్
  • మందుల కొరత లేదన్న సీఎం

ముంబై:మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఏడుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 31కి పెరిగింది. వీరిలో 16 మంది రోజుల పసిబిడ్డలు, పిల్లలు ఉన్నారు. మరోవైపు ఇంకా 71 మంది పేషెంట్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ వరుస మరణాలతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. ‘‘రెండ్రోజుల్లో మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 మధ్య 24 మంది.. అక్టోబర్ 1, 2 తేదీల మధ్య ఏడుగురు పేషెంట్లు చనిపోయారు.

మొదటి రోజు చనిపోయిన 24 మందిలో 12 మంది నవజాత శిశువులు, రెండో రోజు చనిపోయిన ఏడుగురిలో నలుగురు పిల్లలు ఉన్నారు” అని నాందేడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, డాక్టర్ల టీమ్ రెడీగా ఉందని చెప్పారు. మందులు, సిబ్బంది కొరత వల్ల మరణాలు సంభవించలేదని ఆస్పత్రి డీన్ శ్యామ్ రావు వాకోడే తెలిపారు. వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని చెప్పారు. తాము సరైన వైద్యం అందించినప్పటికీ, పేషెంట్లు ట్రీట్​మెంట్​కు స్పందించలేదని పేర్కొన్నారు. 

కాగా, వరుస మరణాల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ‘‘ఇది చాలా బాధాకరం. ఇలాంటి ఘటనే ఆగస్టు 18న థానె ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. నాందేడ్ మరణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి” అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘పబ్లిసిటీ కోసం బీజేపీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. కానీ పిల్లలకు మెడిసిన్ కొనేందుకు డబ్బుల్లేవా?” అని రాహుల్ గాంధీ ట్విట్టర్​లో ప్రశ్నించారు. 

బాధ్యులపై చర్యలు తీసుకుంటం: సీఎం 

నాందేడ్ ఆస్పత్రిలో మరణాలకు సిబ్బంది, మందుల కొరత కారణం కాదని సీఎం ఏక్ నాథ్ షిండే చెప్పారు. ఆస్పత్రిలో సరిపడా సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం ముంబైలో మీడియాతో షిండే మాట్లాడారు. ‘‘ఇది చాలా బాధాకరం. ఈ ఘటనను మేం సీరియస్ గా తీసుకున్నం. దీనిపై విచారణకు ఆదేశించాం. ఒకవేళ ఎవరిదైనా తప్పుంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన తెలిపారు.

డీన్​తో టాయిలెట్లు కడిగించిన ఎంపీ

నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిని శివసేన (షిండే వర్గం) ఎంపీ హేమంత్ పాటిల్ మంగళవారం సందర్శించారు. ఈ క్రమంలో టాయిలెట్లు క్లీన్ గా లేవని గుర్తించిన ఆయన.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టాయిలెట్లను ఆస్పత్రి డీన్ శ్యామ్ రావు వాకోడేతోనే క్లీన్ చేయించారు. ఎంపీ పైప్ తో నీళ్లు కొట్టగా, డీన్ చీపురుతో టాయిలెట్లు క్లీన్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.