
- ఒకరి గల్లంతు.. ఆరుగురుసేఫ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పరివాహక ప్రాంతమైన దంతెల బోరు సమీపంలోని కిన్నెరసాని దాటి సంఘం అటవీ ప్రాంతానికి గొర్రెలను మేపేందుకు వెళ్లిన ఏడుగురు రెండు వాగుల మధ్య చిక్కుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం దంతెల బోర గ్రామానికి చెందిన సాయి కిరణ్(30), తటుకుల కేదారి, దేశ బోయిన ఈశ్వరయ్య, మంచినీల్ల ముసలయ్య, గంగదేవిగుప్ప గ్రామానికి చెందిన కుంజా భద్రయ్య, ఎం. కళ్యాణ్ అనే కాపర్లు గొర్రెలు, మేకలను తీసుకెళ్లారు. వీరు వెళ్లిన కొంత సేపటికి కిన్నెరసాని ప్రాజెక్ట్ 8ఎనిమిది గేట్లను అధికారులు ఎత్తారు.
వరద భారీగా రావడంతో మొర్రెడు–కిన్నెరసాని వాగుల మధ్య వరద వస్తుండడంతో అవతలి వైపు ఉన్న కాపర్లు చిక్కుకుపోయారు. దీంతో వారు న్యూడెమోక్రసీ నిమ్మల రాంబాబుకు వారు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా ద్వారా మీడియా, ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు గుర్తించి గేట్లను దించడంతో వాగు ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. ఇంతలోనే ముగ్గురు కాపర్లు ఈత కొడుతూ ఇవతలి వైపు వస్తుండగా మిగతా నలుగురిని రెస్క్యూ బృందం తాళ్ల సాయంతో ఇవతలిపు లాగారు.
అయితే ఈత కొట్టుకుంటూ వచ్చిన ముగ్గురిలో సాయి కిరణ్ గల్లంతయ్యాడు. అతడి కోసం అధికారులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్రికల్చర్మినిస్టర్ తుమ్మల బాధితులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఎస్పీ బి. రోహిత్ రాజు పోలీస్ సిబ్బంది, రెస్క్యూ టీంతో అక్కడికి చేరుకున్నారు.