ముంబై: ఐపీఎల్ రాకతో క్రికెటర్ల రాత మారి.. బీసీసీఐ పంట పండినప్పటికీ మెగా లీగ్‌లో కొన్ని వివాదాలు మాత్రం మచ్చగా మారాయి. 2008 తొలి సీజన్‌లో జరిగిన ఒక వివాదాస్పద సంఘటన ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. అప్పుడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై క్రికెటర్ హర్భజన్ సింగ్, పంజాబ్ పేసర్ శ్రీశాంత్‌ను చెంపపై కొట్టిన ‘స్లాప్ గేట్’ ఘటన అప్పట్లో పెను దుమారం రేపింది.
17 ఏండ్ల తర్వాత ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో ఓ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన లలిత్ అప్పట్లో టీవీలో ప్రసారం కానీ ఒరిజినల్ వీడియోను చూపించాడు.‘మ్యాచ్ ముగిసిన తర్వాత కెమెరాలు ఆఫ్‌లో ఉన్నాయి. అయితే నా సెక్యూరిటీ కెమెరాల్లో ఒకటి ఆన్ చేసి ఉంది. అది శ్రీశాంత్, భజ్జీ మధ్య జరిగిన గొడవను రికార్డు చేసింది.
భజ్జీ.. శ్రీశాంత్‌ను చెంపపై కొట్టాడు. ఇదిగో ఆ వీడియో’ అంటూ ఆ ఫుటేజ్‌ను చూపెట్టాడు. కాగా, ‘స్లాప్‌గేట్’ వివాదంపై భజ్జీ ఇటీవల మరోసారి శ్రీశాంత్‌కు సారీ చెప్పాడు. మాజీ క్రికెటర్ అశ్విన్‌తో మాట్లాడుతూ తన జీవితంలో మార్చాలనుకునే ఒకే ఒక సంఘటన అదే అన్నాడు.
‘నేను అలా చేసి ఉండకూడదు. దీనిపై నేను ఇప్పటికే 200 సార్లు సారీ చెప్పాను. కొన్నేండ్ల కిందట నేను శ్రీశాంత్ కూతురితో మాట్లాడాను. నేను ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తుండగా తను మీరు మా నాన్నను కొట్టారు, నేను మీతో మాట్లాడను అనడంతో నా గుండె పగిలినట్లు అయింది, కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇప్పటికీ ఆమెకు సారీ చెబుతున్నా’ అని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
One of the wildest moments in IPL history, Unseen footage of the Bhajji–Sreesanth slapgate that never been aired#IPL pic.twitter.com/E9Ux8bodOW
— Vishal (@Fanpointofviews) August 29, 2025
