అమెరికాలోని వాల్ మార్ట్ స్టోర్‭లో కాల్పులు.. 14 మంది దుర్మరణం

అమెరికాలోని వాల్ మార్ట్ స్టోర్‭లో కాల్పులు.. 14 మంది దుర్మరణం

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ దడ పుట్టిస్తోంది. వర్జీనియాలోని చీసాపీక్‭లోని శామ్ సర్కిల్ వద్ద ఉన్న వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులు కలకలం రేపాయి. వాల్ మార్ట్ లో పని చేస్తున్న మేనేజర్ తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 14కి చేరింది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పుల ఘటనతో వాల్‌మార్ట్‌ దగ్గర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో వాల్‌మార్ట్‌ తెరిచే ఉందని యూఎస్ పోలీసులు తెలిపారు. వాల్‌మార్ట్‌ స్టోర్‌ దగ్గరకు భారీ సంఖ్యలో అంబులెన్సులు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మంగళవారం రాత్రి స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూంలోకి వెళ్లి అక్కడున్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 35 నుంచి 40 నిమిషాల పాటు కాల్పులు జరిగాయన్నారు. అయితే.. ఘటనా స్థలానికి చేరుకునే సరికి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు జరిగిన సమయంలో చాలామంది వినియోగదారులు అక్కడే ఉన్నారు. బుల్లెట్ల వర్షం కురిపించడంతో పబ్లిక్ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో పరుగులు పెట్టారు. అమెరికాలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ గన్‌ కల్చర్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. రెండు రోజుల క్రితం నైట్‌క్లబ్‌లో కాల్పులు జరిగాయి. కొలరాడో నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. 16 మందికి గాయాలయ్యాయి.