నకిలీ పత్తి విత్తనాలతో తీవ్రంగా నష్టం

నకిలీ పత్తి విత్తనాలతో తీవ్రంగా నష్టం

వికారాబాద్ జిల్లా  : నకిలీ పత్తి విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు వికారాబాద్ జిల్లా సిరిగాయపల్లి రైతులు. అంకుర్ కంపెనికి చెందిన విక్టర్ బిజి 2 పత్తి విత్తనాలు కొని ఘోరంగా మోసపోయామని వాపోతున్నారు. ఏపుగా పెరిగిన పత్తి మొక్కలకు పూత ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏటా కొనే వ్యాపారి దగ్గరే విత్తనాలు కొన్నామని రైతులు తెలిపారు. అయితే అతని మాటలు నమ్మి దిగుబడి బాగా వస్తుందని అంకుర్ కంపెనీకి చెందిన విత్తనాలు కొన్నామన్నారు. 

సిరిగాయపల్లికి చెందిన పదిమంది రైతులు ఈ విత్తనాలనే నాటారు. అయితే మిగిలిన రైతులు రెండో సారి పత్తి తీస్తున్నారని.. తము మాత్రం పంట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నామన్నారు. మొక్కలు ఏపుగా పెరిగినా పూత ఎండిపోవడం...ఒకవేళ కాయ కాసినా గులాబీ రంగు తెగులు వస్తోందంటున్నారు. నకిలీ విత్తనాలు అమ్మి తమను నట్టేట ముంచిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.