ప్రమాద తీవ్రత వల్లే సైనికుల ఐడెంటిటీ కష్టమైంది

ప్రమాద తీవ్రత వల్లే సైనికుల ఐడెంటిటీ కష్టమైంది

సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని  ఇండియన్ ఆర్మీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే ప్రమాదంలో చనిపోయినవారిని గుర్తించడం కష్టంగా మారిందని వివరించింది. చనిపోయినవారి కుటుంబసభ్యులను ఢిల్లీ పిలిపిస్తున్నట్టు తెలిపింది. డీఎన్‌ఏ టెస్టులతో సైంటిఫిక్‌గా మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తూనే.. కుటుంబసభ్యులతో కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. ఐడెంటిఫికేషన్ పూర్తయ్యాక వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తామని స్పష్టం చేసింది. కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాత మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వివరించింది.

తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్‌ కాలేజీకి వెళ్తుండగా సీడీఎస్ జనరల్ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌‌ బుధవారం  మధ్యాహ్నం కూనూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో అందులో ఉన్న సీడీఎస్, ఆయన భార్య మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో ఉన్నారు. ఆయన వెల్లింగ్టన్‌లోని ఆర్మీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల్లో ఇప్పటి వరకు సీడీఎస్‌ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, మరో ఇద్దరు బ్రిగేడియర్ల మృతదేహాలను మాత్రమే ఆర్మీ అధికారులు గుర్తించారు. మిగిలిన తొమ్మిది మందిని గుర్తించాల్సి ఉంది.