
కోల్‌కతా: నైట్ డ్యూటీలో ఉన్న ఓ నర్సుతో పేషెంట్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సెలైన్ ఎక్కిస్తుండగా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి వెస్ట్ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని ఇల్లంబజార్ హెల్త్ సెంటర్లో చోటు చేసుకున్నది. నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న టైమ్‌లో పేషెంట్ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. బాధితురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు పేషెంట్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలియజేస్తున్నారు.
బీర్భూమ్ జిల్లా ఇన్సిడెంట్‌తో ఇల్లంబజార్ హెల్త్ సెంటర్ వద్ద శనివారం అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాగా, బాధిత నర్సు మాట్లాడుతూ.. ‘‘ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఒకతను హెల్త్ సెంటర్‌కు వచ్చాడు. పరీక్షించాక అతన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు తీసుకెళ్లాను. డ్యూటీ డాక్టర్ సూచన మేరకు సెలైన్ ఎక్కిస్తుండగా.. అతను నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ బూతులు మాట్లాడాడు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే.. ఫ్యామిలీ మెంబర్స్ ముందే అతను నన్ను లైంగికంగా వేధిస్తాడు?’’ అని బాధిత నర్సు చెప్పింది.