- సినిమా స్టైల్ లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- చోరీ అనంతరం సికింద్రాబాద్ లో అజంతా ఎక్స్ ప్రెస్ ఎక్కినట్లు గుర్తింపు
- నిజామాబాద్ జిల్లా పోలీసులకు సమాచారం.. రైలు ఎక్కిన ఇద్దరు ఏసీపీలు
- 30 కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి బోగీ గాలించి ముగ్గురు దొంగల పట్టివేత
నిజామాబాద్, వెలుగు : హైదరాబాద్, షాద్‌నగర్‌లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడి రైలులో పారిపోతున్న ముగ్గురు దొంగలను శనివారం రాత్రి నిజామాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ముగ్గురు వ్యక్తులు శనివారం షాద్‌నగర్ ఏరియాలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా.. ఆ ముగ్గురు మహారాష్ట్ర వెళ్లేందుకు సికింద్రాబాద్ లో అంజతా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారని గుర్తించారు.
వెంటనే నిజామాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చి సీసీ ఫుటేజీ, దొంగల ఫొటోలను వాట్సాప్ చేశారు. దీంతో నిజామాబాద్ నగర ఏసీపీ ప్రకాశ్ యాదవ్, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం రైలు ఎక్కారు. ప్రతి బోగీని తనిఖీ చేస్తూ నవీపేట, ఫకీరాబాద్, బాసర్ దాకా సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించారు.
జనరల్ బోగీలో తనిఖీ చేస్తుండగా.. పైబెర్త్ లో ఇద్దరు, కింద సీట్ లో మరో వ్యక్తి కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రైలు నుంచి దించి నిజామాబాద్ తీసుకొచ్చారు. ముగ్గురి నుంచి రెండు గోల్డ్ చైన్స్ స్వాధీనం చేసుకొని షాద్‌నగర్ పోలీస్‌లకు అప్పగించారు. చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన వ్యక్తులు హరియాణా, పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు ఏసీపీ ప్రకాశ్ యాదవ్ తెలిపారు.
