ట్రంప్కు మరోమారు థ్యాంక్స్ చెప్పిన షెహబాజ్.. భారత్ – పాక్ మధ్య ఘర్షణను ఆపారన్న పాకిస్తాన్ ప్రధాని

ట్రంప్కు మరోమారు థ్యాంక్స్ చెప్పిన షెహబాజ్.. భారత్ – పాక్ మధ్య ఘర్షణను ఆపారన్న పాకిస్తాన్ ప్రధాని

ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్​మధ్య ఘర్షణను ఆపినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరోమారు కృతజ్ఞతలు చెబుతున్నానంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్​ పేర్కొన్నారు. శనివారం (నవంబర్ 09) బాకులో జరిగిన అజర్‌‌‌‌బైజాన్ విక్టరీ డే పరేడ్ లో షెహబాజ్ పాల్గొని మాట్లాడారు. 

“ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ధైర్యవంతమైన, నిర్ణయాత్మక నాయకత్వమే పాకిస్తాన్, భారత్ మధ్య కాల్పుల విరమణకు ఉపయోగపడింది. దక్షిణాసియాలో శాంతిని పునరుద్ధరించింది. ఒక పెద్ద యుద్ధాన్ని నివారించింది. మిలియన్ల మంది ప్రజలను కాపాడింది” అని షరీఫ్ పేర్కొన్నారు. 

వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, పాక్​ కాల్పుల విరమణకు అంగీకరించాయని మే 10 న ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్​ఫాం ట్రూత్​లో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఈ విషయాన్ని అనేకమార్లు వివిధ వేదికలపై వెల్లడించారు. పాకిస్తాన్ సైతం ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అనేక సందర్భాల్లో ప్రశంసించింది. భారత్​మాత్రం ఈ వాదనలు ఎప్పటికప్పుడు తోసి పుచ్చింది. బార్డర్​లో నాలుగు రోజుల తీవ్రమైన డ్రోన్, మిస్సైల్ దాడుల తర్వాత.. ఘర్షణను ముగించడానికి మే 10న భారత్, పాకిస్తాన్  ఒక అవగాహనకు వచ్చాయని.. ఈ ప్రక్రియలో 
మూడో పక్షం పాల్గొనలేదని స్పష్టం చేసింది.