Shahid Afridi: నీకు బౌలింగ్ చేయడం రావట్లేదు.. అల్లుడిపైనే అఫ్రిది ఆగ్రహం.. 

Shahid Afridi: నీకు బౌలింగ్ చేయడం రావట్లేదు.. అల్లుడిపైనే అఫ్రిది ఆగ్రహం.. 

 Shahid Afridi: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు దారుణమైన ప్రదర్శనతో సూపర్–-8 దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్‌కు చేరుకోలేకపోవడంతో ఆ టీమ్ పై విమర్శల పర్వం కొనసాగుతుంది. సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలో బరిలో దిగిన పాక్.. శ్రీలంకపై మినహా మరో ఐసీసీ సభ్యత్వం కలిగిన జట్టుపై విజయం సాధించలేకపోయింది. శ్రీలంకపై కూడా కేవలం 5 పరుగుల తేడాతోనే విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది. సెమీస్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంకను 147 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉండేది. కానీ 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 రన్స్ జస్ట్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో పాక్ నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకునే ఛాన్స్ ని పూర్తిగా కోల్పోయింది. 

అల్లుడి బౌలింగ్‌పై అఫ్రిది అసంతృప్తి: 
శ్రీలంక ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్‌ను వేసిన పేసర్ షాహీన్ అఫ్రిది.. ఆ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ విషయంపై అతడి మామ, పాకిస్థాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది తీవ్రంగా మండిపడ్డాడు. చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నావ్.. అయినా చివరి ఓవర్‌ను ఎలా వేయాలో ఇంకా రావడం లేదా అని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పినా, చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తున్నావ్, ఇకనైనా నేర్చుకోవాలని అఫ్రిది పేర్కొన్నాడు. 

►ALSO READ | T20 World Cup: టీమిండియాపై చంద్రగ్రహణం ఎఫెక్ట్: ముంబైలో మారిన ప్రాక్టీస్ సెషన్ టైమింగ్

అల్లుడికి కీలక సూచనలు:  
షాహీన్ అఫ్రిది బౌలింగ్ యాంగిల్‌పై కూడా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక సూచనలు చేశారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ ఉన్నప్పుడు రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేయొద్దు.. చేయాలనుకుంటే స్టంప్స్‌ను టార్గెట్ చేసుకోవాలని వెల్లడించాడు. థర్డ్‌మ్యాన్, పాయింట్ ఫీల్డర్లు సర్కిల్‌లో ఉన్నప్పుడు వైడ్ యార్కర్లు వేయడం మంచిది కాదన్నారు. ఆసియా పిచ్‌లపై అలా వేస్తే బ్యాటర్లు ఈజీగా బౌండరీలు కొటతారని పేర్కొన్నాడు. ఓవర్ ది వికెట్ నుంచి వేస్తే సిక్సర్లు కొట్టడం కష్టం అవుతుంది అనే విషయాన్ని ఈ కుర్రాళ్లు ఎప్పుడు నేర్చుకుంటారో నాకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. ముఖ్య విషయం ఏమిటంటే, షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను షాహీన్ అఫ్రిది  పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అల్లుడిపైనే బహిరంగంగా అఫ్రిది విమర్శలు చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

ప్లేయర్స్ పై జరిమానాలా?: 
టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. జట్టులోని ప్లేయర్స్ అందరిపై భారీ జరిమానాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పాక్ కరెన్సీలో ఒక్కో ఆటగాడికి సుమారు 5 మిలియన్ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై కూడా  షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. చిల్లర వేశాలు కాకపోతే, ఆటగాళ్లపై ఫైన్ విధించడం కంటే, మంచిగా ఆడలేని ప్లేయర్స్ ని జట్టు నుంచి తప్పించాలని సూచించాడు.