షేక్పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత కన్నుమూత

షేక్పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత కన్నుమూత

షేక్పేట్  మాజీ ఎమ్మార్వో సుజాత గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్ ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో గతంలో అరెస్ట్ అయిన ఆమె డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే గుండెపోటు రావడంతో హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. సుజాత గతంలో ముషీరాబాద్, అంబర్ పేట్, షేక్ పేట్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు. 2020 జూన్లో ఆమె బంజారాహిల్స్ భూ వివాదంలో చిక్కుకున్నారు. ఏసీబీ జరిపిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు దొరకడంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలోనే  ఆమె భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి సుజాత తీవ్ర మనో వేదనకు గురైనట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం తిరిగి విధుల్లో చేరే అవకాశమిచ్చినా ఆమె నిరాకరించారు.

సోదాల్లో రూ.30లక్షలు స్వాధీనం 
బంజారాహిల్స్‌లోని రోడ్డు నెం.14లోని దాదాపు రూ. 40 కోట్ల విలువైన 4,865 చదరపు గజాల స్థలం విషయంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జున రెడ్డి, షేక్ పేట్ అప్పటి వీఆర్ఓ  సుజాత చక్రం తిప్పినట్లు ఏపీసీ గుర్తించింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన అధికారులు2020 జూన్ 8న  సుజాతను ఏపీబీ అధికారులు అరెస్టు చేశారు. గాంధీనగర్‌లోని సుజాత ఇంట్లో సోదాలు నిర్వహించగా బంగారు ఆభరణాలతో పాటు రూ.30 లక్షలు దొరికాయి. అయితే తన ఇంట్లో పట్టుబడిన రూ.30 లక్షలకు సంబంధించిన వివరాలను సుజాత చెప్పలేకపోయారు. అవన్నీ తన జీతం డబ్బులని చెప్పడంతో ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు.

భర్త ఆత్మహత్య
మాజీ ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో కలత చెందిన ఆమె భర్త అజయ్ కుమార్ 2020 జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లిలోని తన సోదరి ఇంటి ఐదో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేసిన అజయ్ కుమార్.. గాంధీ నగర్లోని మాధవ మాన్షన్ ఫ్లాట్ నెంబర్ 404లో భార్య సుజాతతో కలిసి ఉండేవారు. అయితే సుజాతపై అవినీతి ఆరోపణలు రావడం, ఏసీబీ సోదాల్లో ఇంట్లో రూ. 30లక్షలు స్వాధీనం చేసుకోవడం, ఆమె అరెస్ట్ నేపథ్యంలో అజయ్ కొంతకాలం పాటు చిక్కడపల్లిలోని తన సోదరి వద్ద ఉన్నాడు. ఏసీబీ అధికారులు అతనిని సైతం విచారణకు పిలవడంతో భయాందోళనలకు గురైన ఆయన బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసీబీ అధికారుల వేధింపుల కారణంగానే తన అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.