
అక్టోబర్ 2 నుంచి ఇండియాతో జరగనున్న రెండు మ్యాచ్ ల టెస్ట్‌ల సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. జేడాన్ సీల్స్‌తో కలిసి కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసే షమర్ జోసెఫ్ దూరం కావడం విండీస్ జట్టుకు మైనస్ గా మారనుంది. షమర్ స్థానంలో అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ జోహన్ లేన్‌ను ఎంపిక చేశారు. జోసెఫ్ గాయం తీవ్రత ఎలా ఉందనే విషయం క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఇంకా వెల్లడించలేదు.
"ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం షమర్ జోసెఫ్ స్థానంలో జోహన్ లేన్ జట్టులోకి వచ్చాడు. జోసెఫ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరగబోయే వైట్ బాల్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం." అని విండీస్ క్రికెట్ ఒక తమ అధికారిక 'X' లో పోస్ట్ చేసింది. అక్టోబర్ 14న ఇండియాతో రెండు టెస్టుల సిరీస్ ముగుస్తుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత విండీస్ జట్టు అక్టోబర్ 18 నుండి బంగ్లాదేశ్‌లో మూడు వన్డేలు.. అక్టోబర్ 27 నుండి నవంబర్ 1 వరకు మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు షమర్ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది.
టెస్ట్ ఫార్మాట్ లో షమర్ జోసెఫ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 21.66 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు. 19 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 22.28 సగటుతో 66 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అల్జారి జోసెఫ్, జేడెన్ సీల్స్, ఆండర్సన్ ఫిలిప్‌లు వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిన్ గ్రీవ్స్ ఫాస్ట్ బౌలర్ గా జట్టులో ఉన్నాడు. స్పిన్ విభాగంలో జోమెల్ వారికన్, ఖారీ పియరీ, కెప్టెన్ రోస్టన్ చేజ్ ఉన్నారు.
రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గిల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్ దూరం కావడంతో వైస్ కెప్టెన్సీ పగ్గాలు జడేజాకు అప్పగించారు.
ఇండియాతో టెస్ట్ సిరీస్ కు వెస్టిండీస్ జట్టు:
రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్ కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారి జోసెఫ్, జోహన్ లేన్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జేడెన్ సీల్స్