దళిత ఆఫీసర్లకు అవమానం

దళిత ఆఫీసర్లకు అవమానం
  • దళిత ఆఫీసర్లకు అవమానం
  • ఐఏఎస్​, ఐపీఎస్​లకు కీలక పోస్టులు ఇవ్వకుండా చిన్నచూపు
  • అప్రాధాన్య పోస్టుల్లోకి పంపుతూ చులకన
  • సీఎస్​గా పని చేసినా అవమానమే
  • రెండేండ్లలో ఇద్దరు వీఆర్​ఎస్​
  • ఇతర వర్గాల వారికి ఎక్స్​టెన్షన్లు.. పెద్ద పోస్టులు
  • ఉత్తరాది వాళ్లకే ప్రియారిటీ పదవులు

తెలంగాణ వచ్చిన కొత్తలో ఇద్దరు దళితులు ఉప ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీగా దళిత ఐఏఎస్ అధికారి ఉండేవారు. కీలక పదవుల్లోనూ దళిత వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సేవలందించారు. దళితుడినే తొలి సీఎం చేస్తనని ప్రకటించి తానే ఆ సీటులో కుర్చున్న కేసీఆర్.. దళితుల్లో వ్యతిరేకతను తొలగించుకునేందుకు ఆ వర్గానికి చెందిన నాయకులు, ఆఫీసర్లకు ప్రియారిటీ ఇచ్చారు. కానీ మెల్లగా సీన్​ మారింది. ప్రభుత్వ పెద్దల అసలు రంగు బయటపడింది. రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్​ చేశారు. తర్వాత కడియం శ్రీహరికి ఇచ్చినా రెండో టర్మ్​లో ఏకంగా 
ఆ పోస్టునే ఎత్తేశారు. క్రమంగా దళిత ఐఏఎస్, ఐపీఎస్​ ఆఫీసర్లకూ అవమానాలు మొదలయ్యాయి. కీలక పోస్టుల్లో ఉన్న వారిని లూప్​లైన్​లోకి పంపుతున్నారు.  

హైదరాబాద్, వెలుగు: దళిత ఐఏఎస్​, ఐపీఎస్​ ఆఫీసర్లకు కీలక పదవులు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం అవమానిస్తోందన్న చర్చ జరుగుతోంది. వారిని కీలక హోదాల్లో నుంచి తప్పించి అప్రాధాన్య పోస్టులకు పంపుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని వర్గాల ఆఫీసర్లు రిటైర్ అయినా.. వాళ్లను పిలిచి మరీ పెద్ద పోస్టుల్లో కూర్చోబెట్టడం, తమను మాత్రం ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి పంపడం, ఎక్స్​టెన్షన్లు ఇవ్వకపోవడం ముమ్మాటికి వివక్షేనని దళిత ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందు నుంచీ చులకన
ప్రభుత్వం చిన్నచూపు, ఒత్తిళ్ల కారణంగానే సమర్థులైన దళిత ఆఫీసర్లు ఉద్యోగాలు వదిలిపెడుతున్నట్లు తెలుస్తోంది. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ప్రదీప్ చంద్రకు ఎక్స్ టెన్షన్​ ఇవ్వకుండా అగౌరవంగా వీడ్కోలు పలకటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. రెండేండ్లలోనే దళిత వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వీఆర్​ఎస్​ తీసుకోవటం కలకలం రేపుతోంది. ఆకునూరి మురళి, ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ స్వచ్ఛందంగా రిటైర్​మెంట్ తీసుకోవటం వెనుక ప్రభుత్వ పెద్దలు దళిత ఆఫీసర్లను చులకనగా చూస్తున్న తీరే కారణమన్న విమర్శలు వస్తున్నాయి.

సీఎస్​కే అపాయింట్​మెంట్ ఇవ్వలే
తెలంగాణకు రెండో సీఎస్​గా నియమితులైన ప్రదీప్ చంద్రను ప్రభుత్వం అవమానకర రీతిలో సాగనంపింది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర. ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పని చేసిన ప్రదీప్​చంద్ర 2 నెలలే సీఎస్​గా ఉన్నారు. ఆయనకు ఎక్స్​టెన్షన్ ఇవ్వకుండా, కనీసం అపాయింట్​మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ అవమానించారు. ఉత్తరాదికి చెందిన తొలి సీఎస్ రాజీవ్​శర్మకు రెండుసార్లు ఎక్స్​టెన్షన్ ఇప్పించి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించుకొని.. ఘనంగా సెక్రెటేరియట్ వీడ్కోలు పలికిన కేసీఆర్ దళితుడైన ప్రదీప్​చంద్రను అగౌరవంగా సాగనంపారు. అదే సమయంలో సీసీఎల్​ఏ కమిషనర్​గా ఉన్న రేమండ్ పీటర్ కు ఇలాగే అన్యాయం జరిగింది. తనను సలహాదారుగా నియమిస్తామని హామీ ఇచ్చారని నిరీక్షించిన పీటర్ చివరి రోజు వరకు ఎదురుచూసి భంగపడ్డారు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు సమయంలో కీలక పాత్ర పోషించిన వీరిద్దరిని పంపించిన తీరు చర్చనీయాంశమైంది.

నార్త్ ఆఫీసర్లకే ప్రియారిటీ
తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ రాష్ట్రంలో నార్త్ ఐఏఎస్​ల పెత్తనమే కొనసాగుతోంది. తొలి సీఎస్ రాజీవ్ శర్మ ఇప్పటికీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సీఎం దగ్గర తన హవా చెలాయిస్తున్నారు.  రెండేండ్ల కిందటే తెలంగాణకు చెందిన దళిత, గిరిజన, మైనార్టీ, బీసీ ఐఏఎస్‌‌‌‌లంతా ఉత్తరాది పెత్తనంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటి సీఎస్ ఎస్​కే జోషిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్రాధాన్య పోస్టుల్లో తమను నియమించి, ఓసీలకు, ఉత్తరాది ఐఏఎస్ ఆఫీసర్లకు కీలక పోస్టులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 21 మంది ఐఏఎస్ ఆఫీసర్లను దిక్కుమాలిన పోస్టులలో నియమించారని ఫిర్యాదు చేయటం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

దానకిషోర్, విజయ్​కుమార్ కూడా​ జీహెచ్​ఎంసీ కమిషనర్​గా పని చేసిన దానకిశోర్​ను ప్రభుత్వం కొద్ది నెలలకే అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. ఎలక్షన్ టైమ్​లో గ్రేటర్ సిటీలో హోర్డింగ్​లు, ఫ్లెక్సీల విషయంలో టఫ్​గా ఉన్నందుకే రాజకీయ కారణాలతో ఈయనపై అధికార పార్టీ కక్ష కట్టిందనే ప్రచారం జరిగింది. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్​గా పని చేసిన విజయ్​కుమార్​ను ఏడాదిన్నర కింద ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆరు నెలల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్​లో పెట్టింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన్ను బదిలీ చేయటం చర్చకు తెరలేపింది.

ప్రవీణ్​కుమార్​ వీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అందుకేనా..
గురుకులాల కార్యదర్శిగా పని చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్​కుమార్ వీఆర్​ఎస్ తీసుకోవడానికి ప్రభుత్వ ఒత్తిడే కారణమని అభిప్రాయాలున్నాయి. కొత్త గురుకులాల ఏర్పాటు నుంచి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాలను ప్రవీణ్ చేపట్టారు. ఆయన పనితీరును కేసీఆర్ బహిరంగ వేదికలపై కూడా మెచ్చుకున్నారు. గురుకులాల్లో ప్రతి నెల జరిగే మీటింగ్​లకు స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్​ను ఆహ్వానించాలని ఇటీవలి కేబినెట్ మీటింగ్​లో నిర్ణయించారు. అడ్మిషన్లు, గురుకులాల నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్లు, నేతలకు ప్రభుత్వం వంతపాడటం నచ్చకనే ఆయన వీఆర్​ఎస్ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. స్వేరోస్ పేరిట రాష్ట్రమంతటా ఉన్న విద్యార్థి బలగం ప్రవీణ్ వెన్నంటి ఉండటమూ ప్రభుత్వానికి కంటగింపుగా మారిందనే అభిప్రాయాలున్నాయి.

అప్రాధాన్య పోస్టులోకి ఆకునూరి
రెండేండ్ల కిందట సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ వీఆర్​ఎస్​ తీసుకున్నారు. తనను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసిన అసంతృప్తితో ఉద్యోగం వదిలిపెట్టారు. దళిత ఐఏఎస్​లకు అన్యాయం జరుగుతోందని మురళి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈజేఎస్ డైరెక్టర్​గా ఉన్న మురళి, తర్వాత భూపాలపల్లి కలెక్టర్​గా పని చేశారు. నిరుపేదల పక్షపాతిగా పేరున్న మురళి సమర్థుడైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన్ను ఏకంగా ఆర్​కైవ్స్ డిపార్టుమెంట్​కు బదిలీ చేయటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక్కడ వీఆర్​ఎస్​ తీసుకున్న మురళిని ఏపీ గవర్నమెంట్ తమ సలహాదారుగా నియమించుకోవటం గమనార్హం.

ఇది ముమ్మాటికీ వివక్షే..
ఒక్కో ఆఫీసర్‌‌కు ఒక్కో రంగంలో ఎబిలిటీ ఉంటుంది. వారిని ఆయా రంగాల్లో ఉపయోగించుకోవాలి. ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశాను. ప్రతిభ ఉన్నోళ్లకు వాళ్లు మంచి అవకాశాలు ఇచ్చారు. కానీ సీఎం కేసీఆర్‌‌ పాలనలో ఉన్నంత వివక్ష, పూర్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ ఎప్పుడూ చూడలేదు. తెలంగాణలో అగ్రవర్ణాలను అందలం ఎక్కిస్తున్నరు. రిటైర్ అయిన 10 నుంచి 12 ఏండ్లు నాన్‌‌ ఐఏఎస్‌‌ ఆఫీసర్లకు మాత్రం ఐఏఎస్‌‌ కేడర్‌‌ పోస్టులు, కీలక పదవులు అప్పజెప్పారు. బడుగు వర్గాల ఐఏఎస్‌‌లకు మాత్రం అప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారు. సర్వీస్ ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ చాలా మంది కలెక్టర్‌‌గా పనిచేయలేదు. ఇది ముమ్మాటికీ ఎస్సీ, ఎస్టీలపై వివక్షే. ఇంత వివక్ష ఎప్పుడు చూడలేదు. కేసీఆర్‌‌ ఈ ధోరణి మార్చుకోవాలి.
‑ ఆకునూరి మురళి, రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌

సీఎంవోలో దళిత ఆఫీసర్లు ఏరి
దళిత సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతున్న కేసీఆర్​ తన సీఎంవోలో ఒక్క దళిత ఆఫీసర్​కూ ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వలేదు. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఉన్న వాళ్లే సీఎంవోలో కీలకంగా ఉన్నారు. సీఎం ఆఫీసులో ఉన్న ఐదుగురు ఆఫీసర్లలో  ప్రిన్సిపల్ సెక్రటరీ సహా ఇద్దరు సెక్రటరీలు రిటైర్​ అయిన వారే. మిగతా ఇద్దరు మాత్రమే సర్వీస్​లో ఉన్న ఐఏఎస్​లు. మాజీ మంత్రి ఈటల రాజేందర్​ సీఎంవోలో దళితులున్నారా.. అని ప్రశ్నించటం రాజకీయంగా దుమారం లేపింది. దీంతో దళిత సాధికారతకు స్పెషల్ ఆఫీసర్​ను నియమిస్తామని కేసీఆర్​ ప్రకటించినప్పటికీ.. ఇప్పటికీ అమలు కాలేదు.