
హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని అధికారులు ఎంత చెబుతున్నా కొందరు వ్యక్తులు తమ తీరు మార్చుకోక పోవడంతో అలాంటి వ్యక్తులకు మున్సిపల్ సిబ్బంది తగిన రీతిగా పనిష్మెంట్ ఇస్తున్నారు. హైదరాబాద్ నుండి చెత్తను తీసుకొచ్చి శంషాబాద్ మున్సిపాలిటీ పరిది రోడ్డు మీద పడేసిన వ్యక్తిని శంషాబాద్ మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి జాతీయ రహదారి పక్కన దళితుల స్మశాన వాటిక ఆనుకొని ఉన్న స్థలంలో ఒక వ్యక్తి కారులో హైదరాబాద్ నిజాంపేట్ నుంచి వెళుతూ ఆ ప్రాంతంలో చెత్తను పడేశాడు. చెత్తను పడేసి తిరిగి వెళ్తున్న సమయంలో శంషాబాద్ మున్సిపల్ సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. ఆ వ్యక్తి పడవేసిన చెత్తను రిటర్న్ గిఫ్ట్ గా అతనితోనే పూర్తిగా చెత్త ఎత్తించారు. ఈ క్రమంలో ఎవరైనా సరే.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు.