IPL 2024: 2016 లోనే RCB టైటిల్ గెలిచేది.. నా వల్లే ఓడిపోయింది: ఆసీస్ మాజీ క్రికెటర్

IPL 2024: 2016 లోనే RCB టైటిల్ గెలిచేది.. నా వల్లే ఓడిపోయింది: ఆసీస్ మాజీ క్రికెటర్

'ఆర్‌సీబీ - ఐపీఎల్ టైటిల్..' ఈ రెండింటి మధ్య భూమికి.. ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. ఐపీఎల్‌ మొదటి సీజన్ నుంచి ఆర్‌సీబీకి టైటిల్‌ అనేది అందని ద్రాక్షే. ప్రతిసారి ఎన్నో ఆశలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, బొక్కాబోర్లా పడడం ఆ జట్టుకు పరిపాటి. ఆటగాళ్లను మార్చినా.. కెప్టెన్లను మార్చినా.. ఆఖరికి ఆ జట్టు కోచ్ ను మార్చినా.. ఫలితం మాత్రం మారడం లేదు. 2016 లో ఫైనల్లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది. అప్పట్లో ఆర్సీబీ జట్టు తరపున ఆడుతున్న షేన్ వాట్సన్ తన వల్లే జట్టు ఓడిపోయిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

ఇటీవలే జియో సినిమాతో మాట్లాడిన వాట్సన్ 2016 ఫైనల్లో ఆర్సీబీ ఓటమి గురించి మాట్లాడాడు. "2016 లో ఆర్సీబీ టైటిల్ గెలవాల్సింది . కానీ అనుకోకుండా ఫైనల్లో పరాజయం పాలైంది. ఆర్సీబీ  ఫ్యాన్స్ కు నా క్షమాపణలు" అని వాట్సన్ అన్నాడు. 2016లో సన్ రైజర్స్ తో జరిగిన ఫైనల్లో బెంగళూరు ఓడిపోవడానికి వాట్సన్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ బ్యాటింగ్ బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. మొదట బౌలింగ్ లో 4 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. 

బ్యాటింగ్ లో 9 బంతుల్లో ఒక సిక్సర్ తో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కోహ్లీ, గేల్ తొలి వికెట్ కు 114 పరుగుల భారీ భాగస్వామ్యం అందించినా..మిగిలిన వారు విఫలం కావడంతో బెంగళూరు 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుత సీజన్ లో ఆర్సీబీ పరిస్థితి అత్యంత పేలవంగా ఉంది. ఆడిన 7 మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. ఆ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే మిగిలిన 7 మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి.