మా ప్లాట్లను ఇప్పించండి..శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

మా ప్లాట్లను ఇప్పించండి..శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

బషీర్ బాగ్, వెలుగు : మా ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి వెయ్యి మంది సభ్యులు ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతామని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరించింది. తమ స్థలాలపైకి పోనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న జైహింద్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేఘా కృష్ణారెడ్డిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  కేసీఆర్, కేటీఆర్ తక్షణమే స్పందించి తమ ప్లాట్లు ఇప్పించి న్యాయం చేయాలని కోరింది.

బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షురాలు సువర్ణ రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లాడారు. 1983లో  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇందులో 3,228 మంది ఓనర్లను ప్లాట్ల దగ్గరికి వెళ్లనీయకుండా ప్రభుత్వ పెద్దల అండతో వ్యవసాయ భూమిగా చిత్రీకరించి విద్యుత్ పర్మిషన్ తీసుకొని కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్లాట్ల వద్దకు వస్తే కేసులు పెడతామని భయాందోళనకు  గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయంపై త్వరలో  రాష్ట్ర గవర్నర్, ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు.