పార్టీ విలీనం లేదా పొత్తుపై వారంలో క్లారిటీ ఇస్తా: షర్మిల

పార్టీ విలీనం లేదా పొత్తుపై వారంలో క్లారిటీ ఇస్తా: షర్మిల
  • ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో ప్రజా ప్రస్థానం పాదయాత్ర

హైదరాబాద్, వెలుగు: పార్టీ విలీనం లేదా పొత్తు అంశంపై వారంలోగా క్లారిటీ ఇస్తానని వైఎస్సార్​టీపీ ​ చీఫ్ షర్మిల ప్రకటించారు. పబ్లిక్​లో పార్టీపై మంచి అభిప్రాయం ఉందన్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా లోటస్ ​పాండ్​లోని పార్టీ ఆఫీస్​లో జాతీయ జెండా ఆవిష్కరించి మీడియాతో చిట్​చాట్ చేశారు. పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని సూచించారు. భవిష్యత్ తమదే అని, జరుగుతున్న అన్ని పరిణామాలు గమనిస్తున్న అని అన్నారు. పార్టీని విలీనం చేసినా.. పొత్తు పెట్టుకున్నా తోడుగా ఉంటానని, నేతలకు, క్యాడర్​కు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం ఏది మంచి నిర్ణయమో దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. తర్వాత తనను కలిసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. 

కేంద్రానిది డివైడ్ అండ్ రూల్ పాలసీ

జెండా ఆవిష్కరణ తర్వాత దేశ, రాష్ట్ర ప్రజలకు షర్మిల స్వాతంత్ర్య దినోత్సవ శుభాక్షాంక్షలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ పద్ధతి పాటిస్తున్నదన్నారు. బ్రిటిష్ వాళ్ల విధానాన్ని బీజేపీ అనుసరిస్తున్నదని మండిపడ్డారు. ఇందుకు మణిపూర్​లో జరుగుతున్న ఘర్షణలే కారణమన్నారు. కొన్ని నెలలుగా హింస చెలరేగుతున్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని, ఇది భరతమాతకే అవమానమని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇంటర్నెట్ బంద్ చేసి ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తున్నదని షర్మిల మండిపడ్డారు. 60 వేల మంది నిరాశ్రయులయ్యారని అన్నారు.

రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు

కేంద్రం లాగే.. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని షర్మిల మండిపడ్డారు. స్టేట్​లో మహిళలకు గౌరవమే లేదని, ఎక్కడ చూసినా వైన్​షాపులు, బార్లు, పబ్బులే కనిపిస్తున్నాయన్నారు. గుడులు, బడుల కంటే ఇవే ఎక్కువ ఉన్నాయని విమర్శించారు. ఆడ పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డల్ని బయటికి పంపించాలంటే భయపడుతున్నారన్నారు. మద్యం, భూములు అమ్ముకుంటూ కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. రూ.4 లక్షల కోట్ల​అప్పు చేసినా.. రుణమాఫీ ఇంకా అందరికి చేయలేదన్నారు. 30 లక్షల మంది ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కాగా, షర్మిల చేపట్టిన ‘ప్రజాప్రస్థానం పాదయాత్ర’కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కింది. 3,800 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు షర్మిలను కలిసి అవార్డును అందజేశారు.