రాష్ట్రాన్ని తాగుబోతులమయం చేసిండు: షర్మిల

రాష్ట్రాన్ని తాగుబోతులమయం చేసిండు: షర్మిల
  • పాపాలు కడుక్కునేందుకే బతుకమ్మ చీరల పంపిణీ
  • బంగారు తెలంగాణ పేరుతో దోచుకున్నాడని కామెంట్

మందమర్రి/బెల్లంపల్లి : రాబోయే ఎన్నికల్లో  ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ గెలిస్తే  రాష్ట్రాన్ని అమ్మేస్తారని, తాను చేసిన పాపాలు కడుక్కనేందుకే మహిళలకు బతుకమ్మ చీరలు పంచారని వైఎస్ఆర్టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో తన కుటుంబాన్నే  బంగారంగా చేసుకున్నారని ఆమె విమర్శించారు. అవినీతి, కబ్జాలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని కేసీఆర్​ ప్రచారం చేసుకుంటున్నారని ఫైరయ్యారు. ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర సాగింది. మందమర్రి పాత బస్టాండ్​ చౌరస్తా,  బెల్లంపల్లి కాంటా వద్ద రోడ్​షోలో ఆమె మాట్లాడారు. రూ.10వేల కోట్లు ఉన్న మద్యం అమ్మకాలు, కేసీఆర్ సీఎం అయ్యాక గత ఎనిమిదేండ్ల కాలంలో రూ.40 వేల కోట్లకు చేరాయని, రాష్ట్రాన్ని తాగుబోతులమఃయం చేశారని ఆమె విమర్శించారు. -రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహం చేశారని, కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదని, దక్షిణ భారతదేశంలోని అహత్యాచారాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానాన్ని ఆక్రమించిందని ఆమె ఫైర్ అయ్యారు. సొంత పార్టీ ​ నేతల బిడ్డలు నడిరోడ్డుపై, కారులో అత్యాచారాలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఆడపిల్లల మానప్రాణాలు కాపాడలేని సీఎం ఉరివేసుకొని చావాలన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా మంచిర్యాల జిల్లాకు 2 లక్షల ఎకరాలకు, బెల్లంపల్లి నియోజకవర్గానికి 50 వేల ఎకరాలకు వైఎస్సార్ నీళ్ళు ఇవ్వాలనుకున్నారని చెప్పారు. నేడు కేసీఆర్ ప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి బెల్లంపల్లి నియోజకవర్గానికి అన్యాయం చేశారన్నారు. ఇక స్కూళ్లలో పిల్లలకు కనీసం భోజనం పెట్టే దిక్కులేదని, ఎనిమిదేళ్ల కాలంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పంట నష్టపోతే ఒక్క రూపాయి పరిహారం కూడా ఇచ్చే దిక్కు లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చును  రూ.1.40 లక్షల కోట్ల వరకు పెంచి, లక్ష కోట్లు కాజేశారని విమర్శించారు. ఇంత చేసి 50 వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేకపోయారన్నారు. 

44 వేలకు సింగరేణి కార్మికులు తగ్గారు
టీఆర్ఎస్​ సర్కార్​ రాక ముందు సింగరేణిలో 1.16 లక్షల మంది కార్మికులు పనిచేసేవారని, ఇపుడు ఆ కార్మికుల సంఖ్య 44 వేలకు పడిపోయిందని షర్మిల అన్నారు. ఉద్యమ టైంలో సింగరేణిలో ఓపెన్​కాస్ట్​ గనులను రద్దు చేసి అండర్​ గ్రౌండ్ ​బొగ్గు గనులను తవ్విస్తానని కేసీఆర్​ ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. విచ్చలవిడిగా ఓసీపీలకు పర్మిషన్లు ఇచ్చిన కేసీఆర్..​ తెలంగాణ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారన్నారు. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కబ్జాల విషయంలో పెద్దయ్య అని అన్నారు. ఈ నియోజకవర్గంలో సింగరేణి భూములను, పేదల భూములను ఆయన కబ్జా చేసి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ, ఆర్టీసీ బస్ డిపో, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, మ్యాంగో మార్కెట్ తేలేకపోయారని, ఎమ్మెల్యేకు రాబోయే ఎన్నికల్లో బుద్దిచెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో ఏపూరి సోమన్న, అనిల్ పాల్గొన్నారు.

సంబురాలు చేసుకోవడానికి సిగ్గుండాలె
హైదరాబాద్, వెలుగు: “ఊరికో ఎమ్మెల్యేను పెట్టి, మండలానికో ముగ్గురు మంత్రులను పెట్టి, మద్యం, మనీ పంచి, అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్లను బెదిరించి, ఫాం హౌస్ డ్రామా ఆడి కేవలం 10 వేల ఓట్లతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా” అని వైఎస్సార్‌‌‌‌‌‌‌‌టీపీ చీఫ్‌‌‌‌ షర్మిల మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఎన్నికలో గెలిచి, సంబురాలు చేసుకోవటానికి సిగ్గుండాలని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారుపై ఆదివారం ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొని బై పోల్ తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఎమ్మెల్యేలను కొని పార్టీని బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్న బీజేపీకి ఇప్పుడైనా సిగ్గు వచ్చిందా అని ప్రశ్నించారు. దొంగదారి రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు.