రైతు రవి కుటుంబానికి మద్దతుగా షర్మిల దీక్ష

రైతు రవి కుటుంబానికి మద్దతుగా షర్మిల దీక్ష

మెదక్: మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ ది ప్రభుత్వ హత్య అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లీ మరీ ఆమె పరామర్శించారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవి కుమార్ తల్లిదండ్రులకు పెన్షన్ తో పాటు ఆయన కొడుకు వైద్య ఖర్చులు కూడా భరించాల్సిన బాధ్యత కేసీఆర్ సర్కారుదేనన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ డిమాండ్ చేస్తూ.. ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ కూతురుతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే దీక్ష వద్దంటూ పాలవెల్లి సీఐ అడ్డుకోవడంతో ఆయనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరోళ్లంతా వచ్చి దీక్షకు కూర్చోవాలని.. పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోవాలని ఆమె అన్నారు. అసలు తాము శాంతియుతంగా దీక్షకు కూర్చుంటే పోలీసులకు ప్రాబ్లమ్ ఏంటని షర్మిల మండిపడ్డారు. మేం దీక్ష విరమిస్తే..  పోలీసులు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం వచ్చే వరకు దీక్షను విరమించే ప్రసక్తేలేదని రైతు రవికుమార్ కూతురు తేల్చి చెప్పారు. 

కేసీఆర్ ది నియంత పాలన

ప్రభుత్వం వైఖరి కారణంగా ధాన్యం కుప్పల మీద చనిపోయే దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రైతులు ఉన్నారన్నారు షర్మిల. భూమిని నమ్ముకున్న అన్నదాతల గుండె ఆగిపోయేలా చేస్తున్న ఘనత కేసీఆర్ కు దక్కుతుందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కేసీఆర్ పాలన నియంత పాలనను తలపిస్తోందని షర్మిల మండిపడ్డారు. కుటుంబాలను పోషించలేని స్థితిలో ఉన్న రైతన్నలు.. చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారని, తెలంగాణలో ఇప్పటి వరకు 30 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం దురదృష్టకరమని ఆమె అన్నారు. 

మాట తప్పిన ముఖ్యమంత్రి
బంగారు తెలంగాణ చేస్తామని మాటలు చెప్పే ముఖ్యమంత్రి రైతును బతకలేకుండా చేస్తున్నాడని షర్మిల విమర్శించారు. పండిన ప్రతి గింజ కొంటామన్న కేసీఆర్ ఇప్పుడు మాట తప్పడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో వరి వేయొద్దని చెప్పే హక్కు సీఎంకు లేదన్న ఆమె.. మద్దతు ధర అనేది రైతుల హక్కు అని అన్నారు. రైతులు పండించిన వరి పంటను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.